మతాలను మించిన స్నేహం
హన్మకొండ ఆగస్టు 31(విజయ క్రాంతి ): నేడు సమాజంలో మతం, కులం, ప్రాంతం పేరుతో కలహాలతో రగిలిపోతున్న పరిస్థితులు ప్రస్తుతం రోజూ ఎక్కడో ఒక దగ్గర చూస్తూనే ఉన్నాం. కానీ హనుమకొండ నగరానికి చెందిన మూడు మతాలకు చెందిన ముగ్గురు స్నేహితులు మాత్రం ఒకరికొకరు తోడుగా నిలుస్తూ ఒకరి పండుగలను మరొకరు గౌరవిస్తూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.
న్యూ శాయంపేట చెందిన సదిరం ప్రశాంత్ కుమార్ ( క్రిస్టియన్), హనుమకొండ రెడ్డి కాలనీకి చెందిన రాము (హిందు), హనుమకొండ అలంకార్ ప్రాంతానికి చెందిన హఫీజ్ ( ముస్లిం) చాలా సంవత్సరాలుగా స్నేహితులుగా ఉన్నారు. మతాలు వేరైనా ఒకరికొకరు కష్ట సుఖాల్లో చేదోడు వాదోడుగా ఉంటున్నారు.
కుటుంబంలోని వారికి గాని తల్లిదండ్రులకు గాని ఏదైనా అనారోగ్యం పాలైనప్పుడు వెంట ఉంటున్నారు. 31డివిజన్ కాంగ్రెస్ నాయకులు మామండ్ల సురేష్ మాట్లాడుతూ ఒకరి మతాన్ని మరొక్కరు గౌరవించుకుంటూనే ఒకరి పండుగలకు మరొకరు హాజరవుతూ ముగ్గురి మనసు ఒకటేనని చాటి చెప్తున్నారు.
ఈద్, క్రిస్మస్, వినాయక చవితి ఇలా పండగలకు ఒకరి ఇంట్లో ఒకరు కుటుంబ సమేతంగా హాజరవుతున్నారు. ఆదివారం వినాయకుడి వద్ద ఈ ముగ్గురి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి మరో మారు వారు తమ మతసామరస్యాన్ని చాటుకున్నారు. అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న వీరిని పలువురు అభినందిస్తున్నారు.






