వైఎస్సార్ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర
ఆయన సేవలు చిరస్మరణీయం
మాజీ సీఎం విగ్రహానికి డీసీసీ చీఫ్ శివసేనరెడ్డి ఘన నివాళి
వనపర్తి,(విజయక్రాంతి): దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా వనపర్తి డీసీసీ చీఫ్ శివసేనరెడ్డి ఘనంగా నివాళులర్పించారు. బుధవారం వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా శివసేనరెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం విశేషంగా కృషి చేసిన ప్రజానాయకుడని కొనియాడారు. ముఖ్యమంత్రిగా ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశాయని అన్నారు.
ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి వైఎస్సార్ నిరంతరం కృషి చేశారని గుర్తుచేశారు. ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకుని వారికి అండగా నిలవడమే ఆయన రాజకీయ జీవితానికి ప్రత్యేకత అని పేర్కొన్నారు.
వైఎస్సార్ ఆశయాలు, ప్రజా సంక్షేమ పాలన స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోందని తెలిపారు. ఆయన చూపిన ప్రజాసేవా మార్గాన్ని కొనసాగిస్తూ పేదలు, రైతులు, సామాన్య ప్రజల సంక్షేమానికి కృషి చేయడమే నిజమైన నివాళి అని అన్నారు. వైఎస్సార్ అందించిన సంక్షేమ స్ఫూర్తితో నేడు తెలంగాణలో ప్రజాపాలన ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పెద్దగూడెం సర్పంచ్ పుష్పలత శివకుమార్, మండల అధ్యక్షుడు నక్క రవి కిరణ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రహ్మచారి, గ్రామ అధ్యక్షుడు గుండ్రాల రాములు, కొండన్న యాదవ్, శేఖర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, బుచ్చిబాబు, రొయ్యల రమేష్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు.






