01-09-2025 12:28:03 AM
నల్లగొండ, ఆగస్టు 31(విజయక్రాంతి): అక్కడి భూములు హాట్ కేక్.. ఒక్కో ఎకరం రూ.కోట్లలో పలుకుతుంది. ఇలాంటి భూములపై ఓ ప్రైవేటు కంపెనీ కన్నేసింది. పచ్చని భూములను కొల్లగొట్టి ఎలాంటి అనుమతుల్లేకుండా భారీ వెంచర్ వేస్తోంది. ఆ భూములో ఉన్న ఓ కుంటను సైతం మిం గేసింది. ఈ నిర్వాకానికి అధికార యంత్రాం గం సైతం తోడయ్యింది. దీంతో సదరు కంపెనీ యాజమాన్యం బరితెగింపునకు అడ్డూఅదుపు లేకుండా పోయింది.
ఇంతకీ ఆ కంపెనీ మరేదో కాదు.. భువనగిరి మండలం కూనూరు గ్రామపంచాయతీ పరిధిలోని స్మాల్ టానర్స్ కంపెనీ. కంపెనీ పేరు మీద 13 ఎకరాల భూమి ఉంది. ఈ విస్తీర్ణం భూమిని కంపెనీ భవిష్యత్ అవసరాల వినియోగం కోసం అప్పట్లో అడ్డికి పావుసేరు అన్నచందంగా కొనుగోలు చేశారు. కానీ ప్రస్తుతం అదే భూమిని రియల్ ఎస్టేట్ వెంచర్గా మార్చేసి రూ.కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. నిబంధనలు పాటించకుండా కన్జర్వే షన్ జోన్లో ఏలాంటి అనుమతులు లేకుండా 13 ఎకరాల్లో భారీగా వెంచర్ ఏర్పాటు చేశారు. అయినా అధికారుల వైపు నుంచి ఏ మాత్రం స్పందన లేకపోవడం కొసమెరుపు.
కుంటను కొల్లగొట్టి.. వెంచర్ చేసి..
కూనూరు గ్రామపంచాయతీ పరిధిలోని స్మాల్ టానర్స్ కంపెనీ యాజమాన్యం 13 ఎకరాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా.. కనీ స నిబంధనలు పాటించకుండా వెంచర్ ఏర్పా ట్లు చేసి గజాల్లో భూమిని విక్రయిస్తోంది. అయితే సదరు భూమిలో స్థానిక రైతాంగానికి నీటి ఆధారమైన కొంగలకుంటను రాత్రికి రాత్రే పూడ్చేసింది. దీంతో స్థానిక రైతులకు నీటి ఆదరవు లేకుండా పోయింది.
అయితే సదరు భూమిలో కొం గల కుంటను పూడ్చిన వ్యవహారంపై భువనగిరి ఇరిగేషన్ శాఖ అధికార యంత్రాం గానికి స్థానికులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం కొసమెరుపు. సదరు భూమిలో ఒక్కో ఎకరానికి రూ.15 లక్షల వరకు ఇరిగేషన్ అధికారులకు ముట్టజెప్పినట్టు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా పేరుతో ఇండ్లను సైతం కూలగొట్టి నీటి కుంటలు కాపాడుతున్నామంటూ చెబుతున్న అధికారులు, పాలకులకు ఈ కొంగలకుంట కన్పించడం లేదా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
గజాల లెక్కన భూవిక్రయాలు..
కూనూరు గ్రామపంచాయతీ పరిధిలోని సర్వే నంబరు 17, 38, 45, 39 నంబరులో స్మాల్ టానర్స్ కోఆపరేటివ్ ఇండస్ట్రీయల్ లిమిటడ్ పేరుతో 13 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దీన్ని సదరు కంపెనీ యాజమాన్యం నాలా కన్వర్షన్ చేసి గజాల్లో విక్రయిస్తోంది. నిజానికి కన్జర్వేషన్ జోన్లో ఉన్న ఈ భూమిని రియల్ ఎస్టేట్ వెంచర్గా చేసేందుకు ఏలాంటి అనుమతులు ఇవ్వడం కుదరదు.
ఆఖరికీ ప్రభుత్వం కూడా ఇచ్చే వెసులుబాటు ఉండదు. దీనికి తోడు ఈ భూమి కొంగలకుంట బఫర్ జోన్ పరిధిలోకి వస్తుంది. అయినా యాజమాన్యం కుంటను చదును చేసి ఎంచక్కా ప్లాట్లుగా మార్చి విక్రయాలు చేపట్టింది. దీనిపై ఇప్పటివరకు అధికార యంత్రాంగం ఏలాంటి చర్యలు తీసుకోలేదు. కేవలం గ్రామపంచాయతీ కార్యదర్శి సదరు కంపెనీ యాజమా న్యానికి నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంది.
ఇదిలావుంటే. ఈ రియల్ వెంచర్ వ్యవహారం వెనుక జిల్లా స్థాయి కీలక అధికారుల హస్తం ఉన్నట్టు ఆరోపణలు విన్పిస్తు న్నాయి. అందుకే బహిరంగంగా ఇంత జరుగుతున్నా.. అధికారులు అటువైపు కన్నెత్తిచూ డడం లేదనే గుసగుసలు విన్పిస్తున్నాయి. మరోవైపు కలెక్టరేట్కు కూతవేటు దూరంలో ఉండడం.. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంటే క్షేత్రస్థాయిలోనే యాక్టివ్గా తిరుగుతుంటారు. అయినప్పటికీ స్మాల్ టానర్స్ వెంచర్ వ్యవహారంపై చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.