calender_icon.png 20 February, 2026 | 8:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గద్దర్ సినీ అవార్డ్స్ జ్యూరీ కమిటీ చైర్మన్ మార్పు

20-02-2026 01:46:55 AM

రాఘవేంద్రరావు స్థానంలో తమ్మారెడ్డి భరద్వాజకు బాధ్యతలు 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025’కు సంబంధించి జ్యూరీ కమిటీలో కీలక మార్పు చోటుచేసుకుంది. స్పెషల్ అవార్డ్స్ జ్యూరీ కమిటీ చైర్మన్‌గా ప్రముఖ సినీనిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజను నియమిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ కమిటీ చైర్మన్‌గా ఉన్న దర్శకుడు కే రాఘవేంద్రరావు స్థానంలో తమ్మారెడ్డి భరద్వాజను నియమిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఫిబ్రవరి 4న విడుదల చేసిన మునుపటి ఉత్తర్వులను సవరిస్తూ ఈ కొత్త జీవో విడుదల చేశారు. ముఖ్యంగా ‘స్పెషల్ అవా ర్డ్స్’ కేటగిరీలో విజేతలను ఎంపిక చేసే బాధ్యతను తమ్మారెడ్డి భరద్వాజ నేతృత్వంలోని కమిటీ పర్యవేక్షించనుంది. తమ్మారెడ్డి భరద్వాజకు సినీ పరిశ్రమపై ఉన్న అపారమైన అవగాహన, అనుభవం అవార్డుల ఎంపిక ప్రక్రియకు మరింత వన్నె తెస్తాయని అంతా భావిస్తున్నారు.

అయితే, రాఘవేంద్రరావును బాధ్యతల నుంచి ఎందుకు తొలగించారనే కారణాలను ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వెల్లడించకపోవటం గమనార్హం. మార్చి 19న ఉగాది పండుగ సందర్భంగా అవార్డులు అందజేయనున్నారు. ఈసారి మొత్తం 17 విభాగాల్లో పురస్కారాలు ఇవ్వనున్నారు. ముఖ్యంగా సామాజిక స్పృహ కలిగించే చిత్రాలకు ప్రాధాన్యతనిస్తూ ‘ఉత్తమ సామాజిక సందేశ చిత్రం’ పేరుతో అవార్డు ఇవ్వనున్నారు. ‘డాక్టర్ సీ నారాయణరెడ్డి’ పేరు మీద కూడా అవార్డు ఇవ్వనున్నారు.

ఈసారి పోటీలకు మొత్తం 90 ఎంట్రీలు వచ్చాయి. ఈ నెల 6న బరిలో నిలిచిన సినిమాల స్క్రీనింగ్ ప్రారంభమైంది. స్క్రీనింగ్ ప్రారంభమై, సగం పని పూర్తయిన తర్వాత జ్యూరీ కమిటీ చైర్మన్‌ను మార్చటం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. మార్చి 5 లోపు జ్యూరీ కమిటీ స్క్రీనింగ్ పూర్తి చేయాల్సి ఉంది.. అంటే, ఇంకా పక్షం రోజులే మిగిలి ఉంది. ఇప్పటివరకు స్క్రీనింగ్ అయిన సినిమాల విషయంలో సభ్యులు తీసుకున్న నిర్ణయాలతో ముక్కుసూటిగా వ్యవహరించే తమ్మారెడ్డి ఎంతవరకు ఏకీభవిస్తారనేది సందేహమే!