1 September, 2026 | 4:10 AM

రైల్వే హబ్‌గా గద్వాల

01-09-2026 02:19 AM
  1. మరో ఆర్‌ఓబీకి రూ.66 కోట్ల నిధులు
  2. రూ.42.82 కోట్లతో రైల్వే స్టేషన్ ఆధునీకరణ
  3. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
  4. అలంపూర్ ఆలయాల అభివృద్ధికి కేంద్ర నిధులు: ఎంపీ డీకే అరుణ

గద్వాల, ఆగస్టు 31: జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District) రైల్వే హబ్‌(Railway Hub)గా అభివృద్ధి చెందుతుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖల మంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy) అన్నారు. అమృత్ భారత్ పథకం(Amrit Bharat Scheme) కింద రూ. 42.82 కోట్ల నిధులతో గద్వాల రైల్వే స్టేషన్(Gadwal Railway Station) ఆధునీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. సోమవారం గద్వాల రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, రైల్వే ఉన్నతాధికా రులతో కలిసి కేంద్రమంత్రి పరిశీలించారు.

ఈ సందర్భంగా స్టేషన్ అభివృద్ధి పనులపై ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను తిలకించి, ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై నుంచి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, స్టేషన్‌లో ప్లాట్‌ఫారాల విస్తరణ, పార్కింగ్ అభివృద్ధి, నూతన పరిపాలన భవనం, గద్వాల సంస్థానం చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించే ముఖద్వారం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. 

గద్వాలలో మరో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.66 కోట్ల నిధులతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. గత పదేళ్లలో తెలంగాణలో 520 ఆర్‌ఓబీ, ఆర్యూబీ నిర్మాణాలు పూర్తయ్యాయని స్పష్టం చేశారు.  ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. గద్వాల సంస్థానాధీశులు రైల్వే స్టేషన్ కోసం 100 ఎకరాలకు పైగా స్థలాన్ని కేటాయించారని, మిగిలిన భూముల్లో భవిష్యత్తులో రైల్వే ప్రాజెక్టులను ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.

గద్వాల చేనేత జరీ చీరలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతమని, మెరుగైన రైల్వే కనెక్టివిటీతో జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. గద్వాల రైల్వే స్టేషన్లో అన్ని ప్రధాన రైళ్లకు స్టాపింగ్ కల్పించాలని, పార్కింగ్ రుసుముల ను తగ్గించాలని కోరారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కేంద్ర మంత్రికి అందజేశారు.  రైల్వే డీఆర్‌ఎం సంతోష్ కుమార్‌వర్మ,  కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్పర్సన్ జయలక్ష్మి, వైస్‌చైర్మన్ శంకర్ తదిరులు పాల్గొన్నారు.

అలంపూర్ ఆలయాల అభివృద్ధి : ఎంపీ డీకే అరుణ

అలంపూర్ ఆలయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిందని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ తెలిపారు. గద్వాల రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు విమానాశ్రయాలను తలపించేలా జరుగుతున్నాయని అన్నారు. గద్వాల మీదుగా వెళ్లే పలు రైళ్లకు స్టాపింగ్ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చించి చర్యలు తీసుకుంటా మని చెప్పారు. గద్వాల మాచర్ల. రైల్వేలైన్ పనుల ప్రారంభానికి కృషి చేస్తున్నామని తెలిపారు.