1 September, 2026 | 2:22 AM

బాధ్యతలు ఫుల్... పర్యవేక్షణ నిల్!

01-09-2026 01:37 AM

నాగల్‌గిద్ద జడ్‌పీహెచ్‌ఎస్‌లో కానరాని హెచ్‌ఎం

ఏడాది గడిచినా పరిష్కారం కాని సమస్య.. 

రెగ్యులర్ హెచ్‌ఎం కోసం ప్రజావాణిలో ఫిర్యాదు

నాగల్‌గిద్ద, ఆగస్టు 31: నాగల్ గిద్ద మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెగ్యులర్ ప్రధానోపాధ్యాయుడు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే విషయాన్ని పలుమార్లు విజయక్రాంతిలో కథనాలు వచ్చినప్పటికీ విద్యాశాఖాధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లితండ్రులు విమర్శిస్తున్నారు.

ప్రస్తుతం గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడిగా సిద్దారెడ్డి బాధ్యతలు స్వీకరించినప్పటికీ జిల్లా సైన్స్ అధికారిగా కొనసాగుతున్నారు. దీంతో రెండు బాధ్యతలు నిర్వహించలేక పాఠశాల నిర్వహణ కొరవడిందని ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ప్రత్యేకంగా రెగ్యులర్ ప్రధానోపాధ్యాయుడిని నియమించాలని కోరుతూ కెవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గణపతి, వార్డు సభ్యులు రమేష్, తుకారాం సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

ఏడాది క్రితం పదోన్నతిపై గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటికీ, ప్రస్తుతం జిల్లా సైన్స్ అధికారిగా కొనసాగుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఒకే వ్యక్తి ఇటు పాఠశాల హెచ్‌ఎంగా, అటు జిల్లా సైన్స్ అధికారిగా రెండు బాధ్యతలు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొందని తెలిపారు. జిల్లా స్థాయి బాధ్యతల కారణంగా పాఠశాలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండే అవకాశం లేకపోవడంతో నిర్వహణ, పర్యవేక్షణపై ప్రభావం పడుతోందని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. ఏడాది కాలంగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా సమస్యకు పరిష్కారం చూపకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రెగ్యులర్ హెచ్‌ఎంను నియమించాలి...

పాఠశాలకు ప్రత్యేకంగా రెగ్యులర్ హెచ్‌ఎంను నియమిస్తే విద్యార్థుల విద్యాభ్యాసం, ఉపాధ్యాయుల పర్యవేక్షణ, పాఠశాల పరిపాలన మరింత సమర్థంగా కొనసాగుతుందని గణపతి తెలిపారు. ఒకే వ్యక్తి రెండు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు పాఠశాలకు పూర్తిస్థాయి సమయం కేటాయించడం ఎలా సాధ్యం? ఏడాది గడిచినా సమస్యను ఎందుకు పరిష్కరించడం లేదు? అని ప్రశ్నించారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు అధికంగా చదువుకునే పాఠశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.

పాఠశాల భవిష్యత్తు, విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇక ఆలస్యం చేయకుండా రెగ్యులర్ హెచ్‌ఎంను నియమించాలని ప్రజావాణిలో విజ్ఞప్తి చేశారు. ప్రజావాణిలో అందజేసిన ఫిర్యాదును ఎంపీడీవో స్వీకరించి సంబంధిత విద్యాశాఖ అధికారులకు పంపించినట్లు తెలిపారు. నేటికైనా ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలకు ప్రత్యేక హెచ్‌ఎంను నియమించి విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలని గణపతి, వార్డు సభ్యులు రమేష్, తుకారాం, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు కోరుతున్నారు.