1 September, 2026 | 2:53 AM

ప్రశ్నిస్తే దాడులేనా?

01-09-2026 02:17 AM
  1. కాంగ్రెస్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్
  2. గేటుకు నల్ల రంగు పూస్తుంటే ఏం చేస్తున్నారు?
  3. కేంద్ర మంత్రి బండి సంజయ్  
  4. వైఫల్యాలను ప్రశ్నిస్తే భౌతిక దాడులా?
  5. బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్

హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంపై, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి నివాసంపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేయడం అత్యంత పిరికిపంద చర్య అని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి(Union Minister G. Kishan Reddy) తీవ్రంగా ఖండించారు.

ఈమేరకు ఆయన ఒక ప్రకటనను సోమ వారం విడుదల చేశారు. అధికారం అడ్డంపె ట్టు కుని ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలపై దాడులకు దిగడం, ఇళ్లలోకి చొరబడి ఫర్నిచర్ ధ్వసం చేయడమే కాకుండా వృద్ధురాలైన వర్షిత్ రెడ్డి తల్లిని గాయపరచడం కాంగ్రెస్ పాలకుల దివాళాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. రాష్ట్ర కార్యాలయంపై, వర్షిత్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన రౌడీలపై పోలీసులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

కాగా బీజేపీ ఆఫీస్ వద్ద ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం చేసి, కార్యాలయ గేటుకు నల్ల రంగు పూస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని, అసలు రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తోందా? అని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద యూత్ కాంగ్రెస్ నేతల తీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం చేశారు. ఈమేరకు ఈ ఘటనపై పోలీ సు ఉన్నతాధికారులకు కేంద్రమంత్రి బండి సంజ య్ ఫోన్ చేసి వివరణ కోరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరో ప్రకటనలో బీజేపీ ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్  పార్టీ కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండించారు. అధికా రం చేతిలో ఉంది కదా అనే అహంకారంతో బీజేపీ రాష్ట్ర కార్యాలయ గేట్లకు నల్లరంగు పూసి, రౌడీ మూకలతో కార్యాలయంపై దాడులకు తెగబడటం కాంగ్రెస్ ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనమని పేర్కొంటూ సోమవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. బాధ్యులపై వెంటనే పోలీసులు కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.