విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
నిజామాబాద్ నవంబర్ 21:(విజయక్రాంతి): యువత, విద్యార్థులే లక్ష్యంగా గంజాయి విక్రయిస్తున్న ఏడుగురిని మోపాల్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 1.2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను సౌత్ రూరల్ సీఐ సురేష్ కుమార్ శుక్రవారం వెల్లడించారు. మోపాల్ మండలం కంజర గ్రామంలో గంజాయి విక్రయిస్తున్నట్లు పక్క సమాచారం మేరకు మోపాల్ ఎస్సు సుస్మిత సిబ్బందితో కలిసి గురువారం దాడులు నిర్వహించిందన్నారు.
ఈ దాడిలో అక్కడ అనుమానాస్పదంగా సంచరిస్తున్న నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ కు చెందిన అమీర్ ఖాన్, నర్సింపల్లికి చెందిన షేక్ అఫ్రోజ్, కంజర గ్రామానికి చెందిన బత్నాశ్ శివలను అదుపులోకి తీసుకొని విచారించడం జరిగిందన్నారు. వారు ముగ్గురు కలిసి నాందేడ్ జిల్లాకు చెందిన షేక్ ఇమ్రాన్, మీర్జా జుబేర్ బేగ్, అమూల్ చౌరే, షేక్ షేర్ ఖాన్ ల వద్ద కిలోల చొప్పున గంజాయి కొనుగోలు చేసి నిజామాబాద్ లో విక్రయించేవారని విచారణలో తేలిందన్నారు.
కిలోల కొద్ది గంజాయి కొనుగోలు చేసిన ముగ్గురు వ్యక్తులు వాటిని ప్యాకెట్ల ద్వారా రూపాయలు 200,300 చొప్పున యువకులకు, విద్యార్థులకు విక్రయించే వారని విచారణలో వెల్లడైందని సౌత్ రూరల్ సీఐ సురేష్ తెలిపారు. ఏడుగురిని అరెస్టు చేశామని, నాందేడ్ కు చెందిన నలుగురి వద్ద 900 గ్రాముల గంజాయి పట్టుకున్నామని, ఏడు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ఈ కేసును ఛేదించి నిందితులను చాకచక్యంగా పట్టుకోవడంలో ప్రత్యేక చొరవ తీసుకున్న సౌత్ సీఐ రూరల్ తో పాటు మోపాల్ పోలీసులను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అభినందించినట్లు సీఐ 3 ల్లడించారు.






