19 August, 2026 | 4:08 PM

మంత్రి కోమటిరెడ్డికి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి వినతి

19-08-2026 03:13 PM

కుషాయిగూడ, రాధికా ఎక్స్ రోడ్స్ వద్ద ఫ్లైఓవర్లు నిర్మించాలి

ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు కోరిన ఎమ్మెల్యే

ఉప్పల్,(విజయక్రాంతి): ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని కుషాయిగూడ ఎక్స్ రోడ్స్, రాధికా ఎక్స్ రోడ్స్ ప్రాంతాల్లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రెండు ఫ్లైఓవర్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కుషాయిగూడ మరియు రాధికా ఎక్స్ రోడ్స్ ప్రాంతాలు ఈసీఐఎల్, కీసర, నాగారం తదితర ప్రాంతాలకు ప్రధాన అనుసంధాన కేంద్రాలుగా ఉన్నాయని తెలిపారు. వేగంగా జరుగుతున్న పట్టణీకరణ, పెరుగుతున్న జనాభా, వాహనాల సంఖ్య అధికమవడంతో ఈ రెండు కూడళ్ల వద్ద ప్రతిరోజూ తీవ్ర ట్రాఫిక్ రద్దీ నెలకొంటోందన్నారు.

ముఖ్యంగా కార్యాలయాలు, విద్యాసంస్థలకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. దీనివల్ల సమయం, ఇంధనం వృథా కావడంతో పాటు వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం పెరుగుతున్నాయని తెలిపారు. ట్రాఫిక్ రద్దీ కారణంగా రోడ్డు ప్రమాదాల అవకాశాలు కూడా అధికమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో కుషాయిగూడ ఎక్స్ రోడ్స్ వద్ద ఒక ఫ్లైఓవర్, రాధికా ఎక్స్ రోడ్స్ వద్ద మరో ఫ్లైఓవర్ నిర్మించేందుకు అవసరమైన సాంకేతిక పరిశీలనలు చేపట్టి, ప్రాజెక్టులకు తక్షణమే పరిపాలనా అనుమతులు, నిధులు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కోరారు.

ఈ రెండు ఫ్లైఓవర్ల నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్ సమస్యకు గణనీయమైన ఉపశమనం లభించడంతో పాటు ప్రమాదాలు తగ్గి, కీసర, నాగారం, కుషాయిగూడ, ఈసీఐఎల్ పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ప్రజల దీర్ఘకాలిక రవాణా సమస్యకు పరిష్కారం చూపే ఈ రెండు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులను అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి త్వరితగతిన మంజూరు చేయాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి విజ్ఞప్తి చేశారు.