భద్రాచలంలో రూ.4.29 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
వివరాలు వెల్లడించిన డిఎస్పి అరుణ్
భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచలం పట్టణంలో పోలీసులు బుధవారం భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ ఆదేశాల మేరకు భద్రాచలం కూనవరం రోడ్డులోని శ్రీ సుప్రియ (హెచ్‌పీ) పెట్రోల్ బంక్ సమీపంలో పట్టణ ఎస్‌ఐ పి.శ్యాం ప్రసాద్ తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వచ్చిన ఒక పల్సర్ మోటార్ సైకిల్‌ను ఆపేందుకు పోలీసులు ప్రయత్నించారు.
వెంటనే బైక్ వెనుక కూర్చున్న వ్యక్తి లగేజ్ బ్యాగ్‌తో కిందకు దిగగా, బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడి నుండి వేగంగా పరారయ్యాడు. పోలీసులు పట్టుబడిన వ్యక్తి వద్ద ఉన్న లగేజ్ బ్యాగ్‌ను తనిఖీ చేయగా, అందులో నాలుగు ప్యాకెట్లలో ప్యాక్ చేసి ఉన్న 8.580 కిలోల ఎండు గంజాయి లభ్యమైంది. దీని విలువ సుమారు రూ.4.29 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.పోలీసుల విచారణలో నిందితుడిని భద్రాచలం సుందరయ్య నగర్ కాలనీకి చెందిన పర్సిక నాగేశ్వరరావు అనే 45 సంవత్సరాలు గల వ్యక్తిగా గుర్తించారు.
ఈ గంజాయిని ఒడిశా సరిహద్దు ప్రాంతం నుండి తీసుకువచ్చి ఇక్కడ విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు నిందితుడు అంగీకరించాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడు, కొనుగోలుదారు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు. పంచుల సమక్షంలో గంజాయిని స్వాధీనం చేసుకుని, భద్రాచలం పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ వి. సతీష్ కేసు నమోదు చేయగా, దుమ్ముగూడెం ఇన్స్పెక్టర్ (భద్రాచలం ఇంచార్జ్) వెంకటప్పయ్య నిందితుడిని రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు.
ఈ సందర్భంగా భద్రాచలం డీఎస్పీ మాట్లాడుతూ.. భద్రాచలం పరిసర ప్రాంతాలను గంజాయి రహిత ప్రాంతంగా మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణను చేపట్టినట్లు వెల్లడించారు. గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల విక్రయం, రవాణా, నిల్వ గురించిన సమాచారం తెలిసిన ప్రజలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని డీఎస్పీ స్పష్టం చేశారు.






