21 March, 2026 | 2:55 AM

గ్యాస్ వినియోగదారులు నిబంధనలు పాటించాలి

21-03-2026 01:26 AM
  1. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణా పనుల్లో వేగం పెంచాలి

జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. 

ములుగు, మార్చి20 (విజయక్రాంతి): గృహ అవసరాలకు గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకునే వినియోగదారులు ప్రభుత్వ నిబంధనలను పాటించాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్. అన్నారు. గ్యాస్ సిలిండర్ల కొరత, బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు అంటూ కొన్ని మీడియాల్లో వస్తున్న వార్తల నేపథ్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ ఏటూరునాగారం మండల కేంద్రంలోని హెచ్.పీ గ్యాస్ డిస్ట్రిబ్యూటరీ గోదామును, సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ బుకింగ్, సరఫరా ప్రక్రియలో ప్రజలు అవగాహనతో వ్యవహరించాలని సూచించారు.

గ్యాస్ బుకింగ్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనల ప్రకారం ప్రతి సిలిండర్ బుకింగ్కు మధ్య 45రోజుల గ్యాప్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. ఈ గడువు పూర్తి కాకముందు మళ్లీ బుకింగ్ చేయడానికి ప్రయత్నిస్తే ఓటిపి నంబర్ రాదని, ప్రజలు అనవసరంగా గ్యాస్ ఏజెన్సీ కేంద్రాల వద్దకు రావద్దని సూచించారు. గృహ అవసరాలకు గ్యాస్ బుకింగ్ సంబంధించి గతంలో వచ్చిన మెసేజ్లో ఉన్న తదుపరి బుకింగ్ తేదీ చూసుకుని ఆ తేదీకి మాత్రమే బుకింగ్ చేయాలని, గ్యాస్ బుక్ చేసిన వారికి సంబంధిత గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది నిర్దేశిత సమయంలోగా వినియోగదారుల ఇంటి వద్దకే వచ్చి సిలిండర్లను సరఫరా చేయడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.

గ్యాస్ ఏజెన్సీ కేంద్రాల వద్ద గందరగోళం నివారించేందుకు ఓటిపి వచ్చిన వారికి ఒక లైన్ ఏర్పాటు చేసి సిలిండర్లను సరఫరా చేయాలన్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రానికి వైద్య సేవల కొరకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బంది సమయపాలన పాటించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు  సామాజిక ఆరోగ్య కేంద్రంలోని గదులను, వార్డులను, అటెండెన్స్ రిజిస్టర్ ను, లాబ్, మెడికల్ స్టోర్ గది,లేబర్ రూమ్ పరిసరాల  పరిశుభ్రతను పరిశీలించారు. అదేవిధంగా వార్డులలో చికిత్స పొందుతున్న రోగుల వివరాలను, వారికి అందుతున్న వైద్య సేవలు అడిగి తెలుసుకున్నారు.