21 March, 2026 | 4:28 AM

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

21-03-2026 01:25 AM

జనగామ, మార్చి 20 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం జనగామ కలెక్టర్ కార్యాలయం ఎదుట బిజెపి నాయకులు ధర్నా చేపట్టారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల పై ఉద్యమం చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని, రైతు వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారన్నారు.

బీసీ, ఎస్సీ, ఎస్టి, మైనార్టీ విద్యార్థుల స్కాలర్ షిప్ లు, ఫీజు రియాంబర్స్మెంట్ సకాలంలో ప్రభుత్వం మంజూరు చేయటం లేదన్నారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఖాళీ ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన వృద్ధులు, వికలాంగులకి, వితంతువులకు పింఛన్లు చెల్లించాలని అన్నారు. ఇల్లు లేని వారికి ఇళ్లు ఇవ్వాలని, రైతు భరోసా సకాలంలో క్రమం తప్పకుండా చెల్లించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదని అందుకు నిరసనగా ధర్నా చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే ఈ నెల 23 న రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకులు అసెంబ్లీ ముట్టడి చేస్తామన్నారు. రెండున్నర సంవత్సరాలు పూర్తి చేసుకున్నా ఇచ్చిన హామీలు  నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఉద్యమం ఆగదన్నారు.