15 April, 2026 | 6:16 PM

గ్యాస్ కొరత.. రోడ్డెక్కిన వినియోగదారులు

15-04-2026 02:09 PM

షాద్‌నగర్, (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం(Shadnagar Constituency) కొందుర్గు మండల కేంద్రంలో గ్యాస్ కొరతపై వినియోగదారులు మండుటెండలో భగ్గుమన్నారు. గత కొన్ని రోజులుగా ఇరాక్ అమెరికా ఇజ్రాయిల్ దేశాల మధ్య ముదిరిన యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ సరఫరాలలో తలెత్తిన కొరత కారణంగా గ్యాస్ సరఫరా సజావుగా జరగడంలేదని వినియోగదారులు మండిపడుతున్నారు. బుధవారం షాద్ నగర్ - పరిగి రోడ్డులో గ్యాస్ వినియోగదారులు తమకు గ్యాస్ కావాలని ఆందోళన నిర్వహించారు.

రోడ్డుపై గ్యాస్ కోసం మండుటెండలో బైఠాయించారు. రోజుల తరబడి గ్యాస్ ఏజెన్సీ చుట్టూ తిరిగినా గ్యాస్ సిలిండర్లు లభించడం లేదని వినియోగదారులు ఆగ్రహానికి గురయ్యారు. కొందుర్గు మండల కేంద్రంలోని భవాని గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం గత 15 రోజులుగా వినియోగదారులకు సరిపడా గ్యాస్ సరఫరా చేయడం లేదని బుధవారం షాద్ నగర్-పరిగి రోడ్డు పై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పరిగి, షాద్నl నగర్ వైపు వెళ్లే వాహనాలు కొద్దిసేపు నిలిచిపోయాయి. మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు పనులు వదులుకొని వంట గ్యాస్ కోసం ఏజెన్సీ చుట్టూ ప్రతినిత్యం గంటల తరబడి నిరీక్షిస్తున్నా గ్యాస్ లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పౌరసరఫరాల శాఖ అధికారులు గ్యాస్ సరఫరా పై పర్యవేక్షణ చేయాలని కోరుతున్నారు.