10-07-2024 03:15:19 AM
హైదరాబాద్, జూలై 9 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు విషయమై 20 డిప్యూటీ ఈఈలు, ఇద్దరు అకౌంటెంట్ ఆఫీసర్లను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. వారి నుంచి అవసరమైన వివరాలు తీసుకున్న కమిషన్.. ఆ అంశాలతో అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. నేడు ఏఈఈలు కూడా కమిషన్ ముందు హాజరుకానున్నారు. గతంలో నీటిపారుదల శాఖ కార్యదర్శులుగా పనిచేసిన అధికారులనూ కమిషన్ విచారణకు పిలవనుంది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ), సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్) తదితర సంస్థల ప్రతినిధులనూ విచారణకు పిలిచే ఆలోచనలో కమిషన్ ఉంది. నిపుణుల కమిటీ నివేదికను పరిశీలించిన కమిషన్.. అందులోని కొన్ని అంశాలపై వివరణ కోరింది.
తమకు కొన్ని డాక్యుమెంట్లు కావాలని, వాటిని నిపుణులు ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించనుంది. కాళేశ్వరం ఆనకట్టల పనుల్లో సబ్ కాంట్రాక్టర్లు కూడా పనులు చేసినట్లు కమిషన్ దృష్టికి వచ్చినట్లు సమాచారం. ఒక సంస్థలో పని చేసిన ఓ వ్యక్తి ప్రాజెక్టు పనుల సమయంలో విభేదించి బయటకు వెళ్ళారు. ఆయనతో పాటు ఇతరులను కూడా పిలిచే యోచనలో కమిషన్ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాంను కమిషన్ పిలిచింది. ఆయన నుంచి ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు, సమాచారం తీసుకునేందుకే పిలిచినట్లు సమాచారం. శుక్రవారం లేదా సోమవారం రావాలని ఆయనను కమిషన్ కోరింది. ప్రాజెక్టుకు సంబంధించి గతంలో ప్రజెంటేషన్‌తో పాటు పత్రికల్లో కథనాలను ఇవ్వడం, కాళేశ్వరంపై వివిధ సందర్భాల్లో శ్రీరాం మాట్లాడిన నేపథ్యంలో కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది.