యూహెచ్‌టీసీకి 2 ఎకరాలు ఇవ్వండి
బీబీనగర్ ఎయిమ్స్‌కు అనుబంధంగా నిర్మిస్తాం
సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ
హైదరాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి): ఎయిమ్స్ బీబీనగర్‌కు అనుబంధంగా అర్బన్ హెల్త్ అండ్ ట్రైనింగ్ సెంటర్ (యూహెచ్‌టీసీ) ను ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్‌లో 2 ఎకరాల భూమిని కేటాయించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి శనివారం సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. దేశవ్యాప్తంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలను చేరువ చేయడానికి స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలుకొని అన్ని స్థాయిల్లోని ఆరోగ్య కేంద్రాల్లో అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులో ఉంచడానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తోందని చెప్పారు.
బీబీనగర్‌లో ఎయిమ్స్‌లో ఓపీ సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఎయిమ్స్ మెడికల్ కాలేజీ తరగతులు కూడా ప్రారంభించినట్టు చెప్పారు. ఎయిమ్స్ బీబీనగర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నగరంలో ఒక అర్బన్ హెల్త్ అండ్ ట్రైనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ కేంద్రం ద్వారా వైద్య విద్యార్థులకు బోధన, శిక్షణా కార్యక్రమాలను, నగర ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి వీలుగా ఉంటుందని చెప్పారు.
ఎయిమ్స్ బీబీనగర్ ఎక్స్‌టెన్షన్ కోసం నగరంలో తాత్కాలికంగా ఒక ప్రభుత్వ భవనాన్ని కేటాయిస్తే, అక్కడ ఎయిమ్స్‌కు అనుబంధంగా అర్బన్ హెల్త్, ట్రైనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. నగరంలో 2 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయిస్తే అర్బన్ హెల్త్ టీచింగ్, ట్రైనింగ్ సెంటర్‌కు శాశ్వత భవనాన్ని నిర్మించడానికి ఎయిమ్స్ బీబీనగర్ సిద్ధంగా ఉందని చెప్పారు. ఇదే అంశాన్ని తెలియజేస్తూ ఇటీవల డిప్యూటీ డైరెక్టర్, ఎయిమ్స్, బీబీనగర్ హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసినట్టు తెలిపారు.






