30 July, 2026 | 3:07 PM

దాగుడుమూతలెందుకు?

25-08-2024 01:30 AM

ప్రభుత్వాలు ఎంత ఎక్కువ అనుత్పాదక వ్యయాలు చేస్తే అంత ఎక్కువగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటాయి. అంతిమంగా ప్రజలపై అధిక పన్నుల భారం మోపాల్సి వస్తుంది. అప్పుడు మళ్లీ పార్టీలకు గడ్డుకాలమే దాపురిస్తుంది. 

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చటానికి ఆపసోపాలు పడుతున్నది. హామీలు చూస్తే కొండంత, ఆర్థికం చూస్తే గోరంత అన్నట్టుగా పరిస్థితి ఉండటంతో ఏం చేయాలో తోచక పాలకులు చేతులు పిసుక్కుంటున్నారు. హామీలు అమలు చేయలేక, చేయలేమని ప్రజలకు చెప్పలేక సతమతం అవుతున్నారు. నెల గడువాలంటే కచ్చితంగా అప్పులు తెచ్చుకోవాల్సి దుస్థితి ఉన్నది. ఇప్పటికే రాష్ట్ర అప్పులు రూ.7 లక్షల కోట్లు దాటిపోయాయి.

నెలకు రూ.7 వేల కోట్లకు పైగా వడ్డీలే కడుతున్నామని సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే ప్రకటించారు. ఇలాంటప్పుడు ఇంకా గొప్పలకుపోయి ప్రజలను మభ్యపెట్టడం ఎందుకనే ప్రశ్న ఉదయిస్తున్నది. ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల సమయంలో ప్రజలకు ఓట్ల కోసం చేతికి ఎముక లేదన్నట్టు హామీలు గుప్పిస్తుంది. తీరా అధికారంలోకి వచ్చాక అసలు తత్వం బోధపడుతుంది. 

నిజానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రతి రాజకీయ పార్టీ నేతలకు తెలిసే ఉంటుంది. కానీ, వాస్తవాలు చెపితే ఎన్నికల్లో ఓట్లు పడవు. అసలే ఇది ఉచితాల యుగం. ప్రజలకు అన్నీ ఫ్రీ అని ప్రకటించకపోతే ఓట్లు రాలవు. అందుకే అమలు సాధ్యం కాదని తెలిసినా గెలిచిన తర్వాత చూసుకొందాంలే అన్నట్టుగా అలవిగాని ఉచిత హామీలు ఇస్తున్నారు. అధికారంలోకి వచ్చాక అడ్డమైన కొర్రీలు పెట్టి ఎగ్గొట్టే ప్రయత్నం చేసి ప్రజల్లో చులకన అవుతున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు కనీసం ఏటా రూ.50 వేల కోట్లు కావాలని అప్పుడే ఆర్థికవేత్తలు, నిపుణులు మొత్తుకున్నారు. అయినా, కాంగ్రెస్ పెద్దలు తమ గ్యారెంటీలను కచ్చితంగా అమలుచేస్తామని బల్లగుద్ది వాదించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి ‘సచివాలయంలో లంకెబిందెలు ఉంటాయని వస్తే.. ఓటి కుండలే ఉన్నాయి’ అని ప్రకటించిన హామీల అమలుపై మొదట్లోనే సందేహాలు సృష్టించారు.

ఇక అప్పటి నుంచి ప్రభుత్వం ఆ హామీల అమలులో అపసోపాలు పడుతూనే ఉన్నది. ఏపీలో చంద్రబాబు కూడా దాదాపు ఇలాంటి ప్రకటనే చేయటం గమనార్హం. కాంగ్రెస్ గ్యారెంటీల్లో ప్రధానమైన రైతుల రుణమాఫీ మూడు విడుతల్లో చేసింది. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. అందుకు ప్రభుత్వం నెలకు ఆర్టీసీకి దాదాపు రూ.350 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. మొదట్లో ఒకటి రెండు నెలలు బాగానే చెల్లించినా తర్వాత మొత్తం బకాయిలే ఉన్నాయని ఆర్టీసీ ఉద్యోగులు మొత్తుకొంటున్నారు. దీంతో ఆర్టీసీ పరిస్థితి మళ్లీ అప్పుచేసి పప్పుకూడు అన్నట్టుగానే మారిందని చెప్తున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉన్నది.  

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉచితాలపై విపరీతంగా ఖర్చు చేస్తున్నది. వాటిని కొనసాగించేందుకు రాష్ట్ర ప్రగతికి అత్యంత అవసరమైన ప్రణాళికా వ్యయాన్ని తగ్గిస్తూ వెళ్తున్నది. ఇది దీర్ఘకాలంలో రాష్ట్రానికి మంచిది కాదు. నెలనెలా ఉచిత పథకాలకు నిధులు చెల్లించేందుకు కీలకమైన నీటిపారుదల పథకాల వంటి ప్రాజెక్టులకు బిల్లులను ఆపుతున్నారు. ఇది తిరోగమన మార్గమే. ప్రభుత్వాలు ఎంత ఎక్కువ అనుత్పాదక వ్యయాలు చేస్తే అంత ఎక్కువగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటాయి.

అంతిమంగా ప్రజలపై అధిక పన్నుల భారం మోపాల్సి వస్తుంది. అప్పుడు మళ్లీ పార్టీలకు గడ్డుకాలమే దాపురిస్తుంది. అలా కాకుండా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేయటం, పెండింగ్ బిల్లులను ఆలస్యం లేకుండా చెల్లించటం, సమయానికి ఉద్యోగులకు వేతనాలు చెల్లించటం, అత్యంత ముఖ్యమనుకొన్న కొత్త ప్రాజెక్టులను చేపట్టడం వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ పెట్టుబడులు ప్రభుత్వానికి తిరిగి మంచి ఆదాయ వనరులుగా మారుతాయి. 

నిజం చెప్తే ఏం పోయె?

ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రజలకు నిజాలు తెలియకుండా దాచాలనే ప్రయత్నిస్తున్నాయి. అలా కాకుండా ప్రజలకు వాస్తవాలు తెలిపితే వారు కూడా క్రమంగా అర్థం చేసుకొంటారు కదా? వాస్తవాలను దాచటం ప్రజలను మోసం చేయటమే కాదు.. రాష్ట్రాన్ని ధ్వంసం చేయటం కూడా అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా తన ఆరు గ్యారెంటీల అమలు విషయంలో సాధక బాధకాలను ప్రజలకు స్పష్టంగా వివరించాలి.

అధికార పక్షమే కాదు. ప్రతిపక్షం కూడా ఎన్నికల్లో లెక్కకు మిక్కిలి ఉచిత హామీలే ఇచ్చింది. వారు అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజలకు వాస్తవాలు తెలియకుండా ఇలాగే దాచారు. కాబట్టి వారికి ఇప్పుడు ప్రభుత్వంపై దాడి చేసే నైతికత లేదు. ప్రజలకు నిజం చెప్పటం పార్టీ, ప్రభుత్వ పరంగా మొదట కొంచం కష్టమే. కానీ, దీర్ఘకాలంలో అదే అందరికీ మంచిది. 

సి.ఎల్.రాజం

చైర్మన్, విజయక్రాంతి