calender_icon.png 23 February, 2026 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సలహాలివ్వండి

23-02-2026 01:53:16 AM

విపక్షం అసెంబ్లీకి వచ్చి గోదావరి జలాలపై సూచనలిస్తే స్వీకరిస్తాం

ఎన్నికలప్పుడే రాజకీయాలు.. ప్రజలు, నీళ్ల విషయాల్లో కాదు

గోదావరి జల వివాదాలకు బీఆర్‌ఎస్సే కారణం

పదేళ్ల పాలనలో ప్రాజెక్టులు కట్టి ఉంటే సమస్య వచ్చేదే కాదు

జలాల విషయంలో ఏపీకి సహకరిస్తున్నామనడం అసంబద్ధం

ఏపీతో జల వివాద సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటాం

నిరుపయోగ ప్రాజెక్టులనూ వినియోగంలోకి తెస్తాం దేవాదుల ప్రాజెక్టుపై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి

తుపాకులగూడెం వద్ద ప్రాజెక్టు పరిశీలన

ములుగు, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే జల వివాదాలు వచ్చేవే కావని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. గోదావరి జలాల వివాదం రాజకీయరంగు పులుముకోవడానికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించారు. తుపాకులగూడెం వద్ద దేవాదుల ప్రాజెక్టును పరిశీ లించారు. అనంతరం పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 960 టీఎంసీలకు సరిపడా ప్రాజెక్టులు కట్టి ఉంటే సమస్య ఉండేది కాదన్నారు.‘ ఇకనైనా ప్రాజెక్టులు పూర్తి చేసి.. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసుకోవాలి. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీదే 1.10 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. మిగతా వాటిని పట్టించుకోలేదు. ఇప్పుడు మిగతా ప్రాజెక్టుల నిర్మాణానికి, భూ సేకరణకు తీవ్రంగా నిధుల కొరత ఉంది. మేడిగడ్డ కుంగిన తర్వాత అక్కడి నుంచి నీరు ఎత్తిపోయలేదు. కాళేశ్వరం నిరుపయోగ మైనా.. అత్యధికంగా వరి దిగుబడి వస్తోం ది. కేసీఆర్, హరీశ్‌రావు తప్పులు చేశారని ప్రజలు గ్రహించారు.

తీర్పు ఇచ్చారు. పదేళ్లు వాళ్లేం చేశారో? ఈ ప్రభుత్వం ఏం చేసిందో సభలో చర్చిద్దాం. పదేళ్ల అనుభవంతో వాళ్లు సూచనలు చేస్తే.. స్వీకరిస్తాం. జలాల విషయంలో ఏపీకి సహకరిస్తున్నామనేది పూర్తి అసంబద్ధం. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు చేద్దాం. ప్రజలు, నీళ్ల విషయంలో రాజకీయం వద్దు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులను గాలికి వదిలేయం. ప్రజల సొమ్ముతో కట్టిన ప్రాజెక్ట్ల వృథాగా వదిలేసేది లేదు.

నిపుణుల సూచన ప్రకారం మరమ్మతులు చేసి.. వినియోగంలోకి తెస్తాం. విపక్షం అసెంబ్లీకి వచ్చి గోదావరి జలాలపై సూచనలు చేస్తే స్వీకరిస్తాం. ఏపీతో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునే దిశలో ఉన్నాం‘ అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. 

పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం..

వచ్చే రెండు నుంచి మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలోని పెండింగ్‌లో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రాధాన్యతా క్రమంలో నిధుల కేటాయింపు, భూసేకరణ వేగవంతం, సాంకేతిక అడ్డంకుల అధిగమించేందుకు అవసర మైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, సాగునీటి వనరుల సమర్థ వినియో గంతో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తామని చెప్పారు. దేవాదుల ప్రాజెక్టు పూర్తయితే లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. జూన్ 2లోపు భూసేకరణ పూర్తి చేయాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో భూసేకరణ ప్ర ధాన అడ్డంకిగా మారకూడదని,రైతుల ప్రయోజనాలే పరమావధిగా పనులు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రికి మంత్రి సీతక్క ధన్యవాదాలు

ములుగు నియోజకవర్గానికి  నీళ్లు ఇచ్చేందుకు ఇప్పుడిప్పుడే ప్రణాళికలు రూపొందించినందుకు మంత్రి సీతక్క ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి  ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలోని చాలా మండలాల్లో నీటి పరిస్థితి దారుణంగా ఉందన్నారు. దశల వారీగా నైనా అన్ని మండలాలకు నీరు ఇవ్వాలన్నారు. గోదావరి నదిని ఆనుకొని కన్నాయిగూడెం, ఏటూరునాగారం,

మంగపేట మూడు మండలాలు ఉన్నాయని, ఇటీవల ఇచ్చిన 143 కోట్ల రూపాయలతో మల్లంపల్లి ములుగు మండలాల్లో పనులు అవుతున్నాయని అదేవిధంగా రామప్ప,లక్నవరం కలపడంతో గోవిందరావుపేట,తాడ్వాయి మండలాలు పూర్తవుతున్నాయన్నారు.  ఆయన వెంట మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, జిల్లా ఎమ్మెల్యేలు ఉన్నారు.