30 July, 2026 | 2:48 AM

దేవుడే నన్ను పంపాడు

26-05-2024 02:44 AM

దేవుడు నిర్దేశించిన పని నెరవేరుస్తా..

అప్పటివరకు నన్ను నమ్ముకున్న వారికోసం శ్రమిస్తా

ప్రతిపక్షాలు నాకు శత్రువులు కాదు

వారితో కలిసి పని చేయాలని భావిస్తున్నా

న్యూఢిల్లీ, మే 25: ఏదో దైవ కార్యం చేసేందుకు దేవుడే తనను భూమి మీదకు పంపాడని నమ్ముతున్నానని, అది అయిపోయేవరకు కష్టపడి పనిచేస్తానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తాజాగా ఎన్డీటీవీకి ప్రధాని ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. తనను నమ్మిన వారికి సేవ చేయడం తన బాధ్యత అని పేర్కొన్నారు. ‘నన్ను దారుణంగా దూషించేవారిని మీరు చూశారు. నన్ను ఇష్టపడే వారినీ చూశారు. నన్ను నమ్మిన వారికి సేవ చేయడం నా విధి’ అని ప్రధాని మోదీ వివరించారు. ‘నన్ను కొందరు క్రేజీ అనుకోవచ్చు. కానీ పరమాత్మ నన్ను ఓ కార్యంపై పంపించాడు. ఆ కార్యం ముగిసిందంటే చాలు. అందుకే నన్ను నేను భగవంతుడికి అంకితం చేసుకున్నాను’ అని ప్రధాని మోదీ అన్నారు. తనను భగవంతుడు ఏ పని చేయాలో చెబుతూ ఉంటా రని, కానీ ఏం చేయాలో  మాత్రం చెబుతుంటాడని వివరించారు. తాను తర్వాత ఏం చేయాలో మాత్రం చెప్పేందుకు నేరుగా ఆయనతో మాట్లాడలేనని చెప్పారు. 

ప్రతిపక్షాలు నా శత్రువులు కాదు

ప్రతిపక్షాలు తనపై ఎంతగా దాడి చేసినా వారు తనకు శత్రువులు కాదని, దేశ అభివృద్ధి కోసం ప్రతిపక్ష నేతలతో కలసి పనిచేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. ‘ప్రతిపక్షాలను నేను చాలెంజ్ చేయలేదు. నాతో పాటు వారు కూడా పనిచేయాలని భావిస్తున్నాను. ఎవరినీ తక్కువ చేయలేదు. వాళ్లు 60 ఏళ్లుగా ప్రభుత్వాలను నడిపారు. వారు చేసిన మంచి పనులను నేను నేర్చుకోవాలని అనుకుంటున్నాను’ అని ప్రధాని మోదీ అన్నారు.

పాత తరం ఆలోచనలు వదులుకుంటా

‘పాత మెంటాలిటీని వదులుకోవాలని అనుకుంటున్నా. 21వ శతాబ్దంలో దేశం అభివృద్ధి చేసేందుకు 18వ శతాబ్దం నాటి చట్టాలు, సంప్రదాయాలను రుద్దలేను. సంస్కరణలు, మార్పు ఆధారంగా అభివృద్ధి చేస్తాను’ అని ప్రధాని అన్నారు.

ఓటు బ్యాంకు కోసమే

శనివారం బీహార్‌లోని పాటలీపుత్రలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్రమోదీ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ముస్లిం ఓటు బ్యాంకు కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తోందని వివరించారు. మైనారిటీ సంస్థల్లో  కావాలనే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఆర్జేడీ,  కాంగ్రెస్ రిజర్వేషన్లు లేకుండా చేశారని దుయ్యబట్టారు. ‘సామాజిక న్యాయం కోసం పోరాడేందుకు బీహార్ ఒక దారి చూపింది. ఈ నేలపై ఉంచి నేను ప్రకటించాలని అనుకుంటున్నాను.. ముస్లింల కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను లాక్కోకుండా ఉండేందుకు నా శాయశక్తులా ప్రయత్నిస్తా. వారి ఓటు బ్యాంకు కోసం ప్రతిపక్షాలు బానిలుగా ఉండనివ్వండి’ అంటూ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ‘ఓటు జిహాద్ పాల్పడే వారి మద్దతుతో ప్రతిపక్షాలు పబ్బం గడుపుకుంటున్నాయి. పశ్చిమబెంగాల్‌లో ముస్లింలకు ఓబీసీ సర్టిఫికెట్లు ఇస్తే ఏమైందో తెలుసు కదా’ అని ప్రధాని మోదీ అన్నారు.  

లాంతర్ వెలుగు వారి కోసమే

ఆర్జేడీ ఎన్నికల గుర్తు అయిన లాంతర్‌పై ప్రధాని మోదీ సెటైర్లు వేశారు. ‘ఎల్‌ఈడీ బల్పుల కాలంలో కొందరు ఇంకా లాంతర్ పట్టుకుని తిరుగుతున్నారు. ఆ వెలుగును వారి కుంటుంబానికి మాత్రమే ఇచ్చి మిగిలిన బీహార్‌ను అంధకారంలోకి నెట్టేయాలని చూస్తున్నారు’ అని మోదీ ఎద్దేవా చేశారు.