30 July, 2026 | 3:45 AM

ప్రధానిగా ప్రవర్తించండి

26-05-2024 02:41 AM

ఆ పదవి విలువనుదిగజార్చకండి

మాట్లాడే భాష గౌరవంగా ఉండాలి

మోదీ ముజ్రా వ్యాఖ్యలపై ప్రియాంక

న్యూఢిల్లీ, మే 25: ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇండియా కూటమి పార్టీలు వేశ్యా నృత్యాలు చేస్తున్నాయని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి భాషను గత ప్రధానులు ఎవరూ ఉపయోగించలేదని ప్రియాంక దుయ్యబట్టారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. ప్రధాని పదవి విలువను దిగజార్చవద్దని హితవు పలికారు. ‘మోదీ ఏం చెప్తున్నారు? ఆయన పదవి విలువను కాపాడే బాధ్యత మోదీకి లేదా? ప్రధాని పదవిని మేం గౌరవిస్తాం. ఆయన అసలు స్వరూపం ఇప్పుడు కనిపిస్తున్నది. ఈ అసలు స్వరూపాన్ని దేశానికి చూపించకండి. ఆయన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం మర్చిపోయారు. మీ చర్యలను చూసి భవిష్యత్ తరాలు ఏమనుకొంటాయి?’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. 

మోదీ భాష బీజేపీవాళ్లకే నచ్చుతలేదు: తేజస్వీయాదవ్

మోదీ ముజ్రా వ్యాఖ్యలపై ఆర్జేడీ అగ్రనేత తేజస్వీయాదవ్ తీవ్రంగా స్పందించారు. ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ప్రతి దఫా పోలింగ్ తర్వాత ప్రధాని భాష మరింత దిగజారుతున్నదని విమర్శించారు. మోదీ ఉపయోగిస్తున్న భాష ఆయన సొంత పార్టీ బీజేపీ కార్యకర్తలకే నచ్చటం లేదని అన్నారు.