2 August, 2026 | 1:18 AM

నిలకడగా గోదావరి

02-08-2026 12:00 AM
  1. భద్రాచలం వద్ద దుమ్మగూడెం చర్ల, వెంకటాపురం వెళ్లే రహదారి ముంచెత్తిన వరద 
  2. ఛతీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలతో పాటు మండలాలకు రాకపోకలు బంద్ 
  3. బ్యాక్ వాటర్‌తో మునిగిన రామయ్య అన్నదాన సత్రం
  4. నీట మునిగిన పంటలు.. రైతుల్లో ఆందోళన

భద్రాచలం/భద్రాచలం టౌన్/ దుమ్ముగూడెం/బూర్గంపాడు, ఆగస్టు 1 (విజయక్రాంతి): భద్రాచలం వద్ద గోదావరిలో నిలకడగా కొనసాగుతోంది. శనివారం ఉదయం 11 గంటలకు 56.10 అడుగులు చేరుకొని మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగింది. గోదావరి నదికి మూడో ప్రమాద హెచ్చరిక శుక్రవారం రాత్రి జారీ చేసిన అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో అప్రమత్తమై సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేశారు. భద్రాచలం వద్ద 56 అడుగులకు చేరుకోగానే భద్రాచలం నుంచి దుమ్మగూడెం చర్ల, వెంకటాపురం వెళ్లే రహదారిని ముంచెత్తింది. దీంతో ఛతీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలతో పాటు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

బ్యాక్ వాటర్‌లో రామయ్య అన్నదాన సత్రం మునిగిపోయింది. బూర్గంపాడు జలదిగ్బంధంలో చిక్కుకున్నది. వందల ఎకరాల్లో పంటలు నీటమునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరదలు తగ్గేవరకూ ముంపుబాధితులు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట స్పష్టం చేశారు. పునరావాస కేంద్రాల్లో నాణ్యమైన భోజనంతో పాటు పారిశుధ్యం, వైద్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

భద్రాచలం సరిహద్దు గల ఆంధ్రలోని రాయినిపేట వద్ద గోదావరి బ్యాక్ వాటర్ రోడ్డును ముంచేతడంతో భద్రాచలం నుంచి నెల్లిపాక మీదిగా ఛతీస్‌గఢ్, ఒడిశా వెళ్లాల్సిన వాహనాలు సైతం ఆగిపోయాయి. విస్టా కాంప్లెక్స్ వద్ద గల మోటార్లు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల గోదారి బ్యాక్ వాటర్ భద్రాచలం పట్టణంలోకి ప్రవేశించడం వల్ల ఇస్తా కాంప్లెక్స్, అన్నదాన సత్రం వరద నీటిలో మునిగిపోయాయి. కర్రకట్ట స్లూయిస్‌లు లీక్ అవ్వడం వల్ల రెడ్డి సత్రం కొత్త కాలనీ సుభాష్‌నగర్ ప్రాంతాలలో బ్యాక్ వాటర్ రావడంతో పలు గృహాలు నీటిలో మునిగిపోయాయి.

శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ అంకిత్ గోదావరి కరకట్ట పరిసర ప్రాంతాలను, ముంపునకు గురి అయ్యే ప్రాంతాలను పరిశీలించి, సహాయక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వరదలు తగ్గేవరకూ ముంపుబాధితులు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట స్పష్టం చేశారు. భద్రాచలం పట్టణం సుభాష్ నగర్ కాలనీ శివారు ప్రాంతంలో చేపట్టిన కరకట్ట నిర్మాణం పనులు పూర్తి కాకపోవడంతో గోదావరి వరద నీరు పట్టణంలోకి ప్రవేశించింద ని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఏజే రమేష్ ఆరోపించారు.