2 August, 2026 | 1:19 AM

బయ్యారం.. ప్రకృతి వయ్యారం

02-08-2026 12:00 AM

మేఘాలను ముద్దాడే కొండలు.. పచ్చని అడవులు.. పాల నురగ వలె కిందకు జాలువారే జలపాతాల గలగలలు.. ప్రకృతి పరవశంలో విహరించే వన్యప్రాణుల కనువిందు.. తెలంగాణ పర్యాటక పటంలో ఇంకా వెలుగులోకి రాని అపురూప ప్రకృతి స్వర్గం.. బయ్యారం మణిహారం.. అభయారణ్యం.

వేకువజామున తొలి సూర్యకిరణాలు కొండ శిఖరాన్ని ముద్దాడుతూ.. విరజిమ్మే వెలుగుజిలుగులు రాత్రంతా చెట్ల ఆకులపై నిలిచిన మంచు బిందువులు బంగారు ముత్యాల్లా మెరవడం.. చెట్లకొమ్మల వయ్యారాల ఒరవడిలో.. దట్టమైన అడవిలోని నిశ్శబ్దాన్ని చీల్చుతూ నెమళ్లు కూతల సవ్వడి.. దూరంగా జింకల గుంపు పచ్చిక బయళ్ల వైపు పరుగుల పదనిసలు.. చల్లని గాలి.. ఔషధ మొక్కల పరిమళంలో మనసు గిలిగింతల కౌగిలిలో దోబూచులాడుతూ.. అద్భుతలోకలంలో విహరింపజేస్తుంటుంది.

ఇది సినిమా దృశ్యం కాదు.. మహబూబాబాద్ జిల్లా బయ్యారం అభయారణ్యంలో ప్రకృతి ప్రతి రోజూ ఓ అద్భుతమై పర్యాటకులను ఆహ్వానిస్తుంటుంది. ఆహ్లాదపరుస్తుంటుంది. మళ్లీమళ్లీ రా..రమ్మని పిలుస్తుంటుంది. 

పర్యాటకుల స్వర్గధామం అభయారణ్యం

తెలంగాణ రాష్ట్రంలో ప్రకృతి తన వైభవాన్ని ఆవిష్కరించిన అద్భుత ప్రాంతాల్లో బయ్యారం అభయారణ్యం ఒకటి. వేలాది ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ అరణ్యం కేవలం చెట్ల సముదాయం కాదు. ఇది జీవవైవిధ్యానికి నిలయం, వర్షాలకు ఆధా రం, వన్యప్రాణులకు ఆశ్రయం, ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం. బయ్యారం అడవిలోకి అడుగు పెట్టిన క్షణం నుంచి మనసులోని అలజడి మొదలై నేచర్‌తో మమేకమై.. పరవశిస్తోంది.

ఎత్తున టేకు, నల్లమద్ది, వెదురు, మర్రి, రావి వంటి భారీవృక్షాలు ఆకాశాన్ని తాకు తూ సహజ గ్రీన్ కారిడార్‌కు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అడవి మార్గాల్లో నడుస్తుంటే ఆకుల గలగలలు, పక్షుల కిలకిలారావాలు, వాగుల జలజలలు కలిసి ప్రకృతి సంగీతాన్ని వినిపిస్తాయి. వర్షాకాలంలో ఈ అడవి మరో ప్రపంచంలా మారిపోతుంది. మేఘాలు కొం డలపై వాలిపోతాయి. అడవిలో ప్రతి చెట్టు కొత్త పచ్చదనాన్ని సంతరించుకుంటుంది. చిన్నచిన్న జలపాతాలు, వాగులు జీవంతో కళకళల సవ్వడి చేస్తూ.. అతిథులను అబ్బురపరుస్తాయి. 

జీవవైవిధ్యానికి జీవనాడి

బయ్యారం అభయారణ్యం అనేక జంతు, పక్షి, వృక్ష జాతులకు నిలయం. అడవిలో సంచరించే జింకలు, అడవి పందులు, కుందేళ్లు, నెమళ్లు, అడవి కోళ్లు, రంగురంగుల పక్షులు ప్రకృతి సమతుల్యతకు ప్రతీకలు. పర్యాటకులకు ప్రకృతి పాఠశాలై సహజత్వాన్ని బోధిస్తోంది. బయ్యా రం అభయారణ్యం కేవలం సందర్శన ప్రదేశం మాత్రమే కాదు. ఇది ప్రకృతి బడిలా ప్రతి అడుగూ ఎంతో జ్ఞానాన్ని పెం పొందిస్తోంది. అంతేకాదు అడ వి నడకలు (నేచర్ వాక్), ట్రెక్కిం గ్, బర్డ్ వాచింగ్, వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ, ప్రకృతి అధ్యయన శిబిరాలు, పర్యావరణ అవగాహన కార్యక్రమాలు, నిర్వహించడానికి అత్యంత అనుకూల పరిస్థితులు ఉన్నాయి.

ఎకో టూరిజం... బయ్యారం భవిష్యత్

ప్రపంచం మొత్తం ఇప్పుడు ప్రకృతి ఆధారిత పర్యాటకానికి ప్రాధా న్యం ఇస్తోంది. బయ్యారం అభయారణ్యంలో కూడా పర్యావరణానికి హాని కలగకుండా ఎకో టూరిజం అభివృద్ధి చేయవచ్చు. అటవీ శాఖ మరింత సంరక్షణ చర్యలు చేపడితే ఈ ప్రాంతం జీవవైవిధ్య పరిశోధనలకు జాతీయస్థాయిలో గుర్తింపు పొందే అవకాశం ఉంది.

స్థానికులకు బంగారు భవిష్యత్

పర్యాటక అభివృద్ధి వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. హోమ్ స్టేలు, జీప్ సఫారీలు, పర్యాటక మార్గదర్శకు లు, హస్తకళల విక్రయం, స్థానిక వంటకాల కేంద్రాలు, అటవీ ఉత్పత్తుల మార్కెటింగ్ వంటి రంగాల్లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది.

కాపాడితేనే నిలిచే ప్రకృతి

అడవి అభివృద్ధి అంటే కాంక్రీట్ భవనాలు కాదు. ప్రకృతిని కాపాడుతూ పర్యాటకాన్ని పెంచడం. ప్లాస్టిక్ నిషేధం, చెత్త నిర్వహణ, నియంత్రిత సందర్శకుల విధానం, వన్యప్రాణుల సంరక్షణ, అటవీ అగ్నిప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ప్రకృతిని జయించడం గొప్ప కాదు. ప్రకృతితో కలిసి జీవించడం గొప్ప. అలాంటి జీవనానుభూతిని అందించే తెలంగాణ ప్రకృతి రత్నం బయ్యారం అభయారణ్యం. ఒకసారి అడుగుపెడితే మళ్లీమళ్లీ వెళ్లాలనిపించే పచ్చని ప్రపంచం అది.

ఏర్పాటు చేయదగిన సౌకర్యాలు

* అడవి సఫారీ

* వ్యూ పాయింట్లు

* బర్డ్ వాచింగ్ టవర్లు

* ట్రెక్కింగ్ మార్గాలు

* ఎకో కాటేజీలు

* క్యాంపింగ్ జోన్

* సైక్లింగ్ ట్రాక్

* అటవీ వివరణ కేంద్రం

* గిరిజన మ్యూజియం

* ప్రకృతి విజ్ఞాన కేంద్రం

ఇవి ప్రత్యేకతలు

ప్రాంతం: బయ్యారం మండలం, మహబూబాబాద్ జిల్లా

ప్రత్యేకత: దట్టమైన అడవులు, జీవవైవిధ్యం

అనువైన కాలం: జూలై నుంచి ఫిబ్రవరి వరకు

చూడదగిన అంశాలు: ప్రకృతి దృశ్యాలు, జలపాతాలు, వాగులు, పక్షులు, వన్యప్రాణులు, గిరిజన సంస్కృతి

అనువైన పర్యాటకం: ఎకో టూరిజం, ట్రెక్కింగ్, బర్డ్ వాచింగ్, ఫొటోగ్రఫీ

 బండి సంపత్ కుమార్

(మహబూబాబాద్, విజయక్రాంతి)