బాలికల సంరక్షణతోనే బంగారు భవిష్యత్తు
రాఖీ వేడుకల్లో మహిళా సాధికారత కేంద్రం జిల్లా కో ఆర్డినేటర్ దయా అరుణ
సుల్తానాబాద్,(విజయక్రాంతి): బాలికల రక్షణ, విద్య, సాధికారతే సమాజ అభివృద్ధికి పునాది అని జిల్లా మహిళా సాధికారత కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ దయా అరుణ అన్నారు. బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా గురువారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని ఓల్డ్ ఏజ్ హోమ్, వికలాంగుల పాఠశాల, చిల్డ్రన్స్ హోమ్‌తో పాటు పలు సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లో రాఖీ వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా దయా అరుణ మాట్లాడుతూ రక్షాబంధన్ (రాఖీ పౌర్ణమి) అన్నది అన్నాచెల్లెళ్ల అనుబంధానికి, పరస్పర రక్షణకు ప్రతీకగా నిలిచే పవిత్రమైన పండుగ అని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం, ఆర్థిక సాధికారత కోసం అనేక పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తున్నాయని దయా అరుణ వివరించారు. బేటీ బచావో – బేటీ పడావో ద్వారా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆద్వర్యం లో బాలికల పట్ల సమాజ దృక్పథంలో మార్పు తీసుకురావడంతో పాటు వారి విద్య, సాధికారతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.
విద్యార్థినులు పరస్పరం రాఖీలు కట్టుకుని ఆనందాన్ని పంచుకున్నారు. పండుగ సందర్భంగా ప్రేమ, ఆప్యాయత, బాధ్యత, సమానత్వం వంటి విలువలను పిల్లలకు వివరించారు. బాలికల సంరక్షణ, విద్య, భద్రతపై అవగాహన కల్పిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు, ఈ కార్యక్రమంలో భరోసా కోఆర్డినేటర్ ఆశ్రిత, కేడర్ ఎన్జీవో ఆఫీసర్ సతీష్, ఓల్డ్ ఏజ్ హోమ్ కోఆర్డినేటర్ నరేడ్ల స్వామితో పాటు సిబ్బంది, విద్యార్థులు, చిన్నారులు పాల్గొన్నారు.






