22 June, 2026 | 3:33 AM

స్టీరింగ్ తిప్పేదెవరు?

22-06-2026 02:06 AM

ఆర్టీసీలో సిబ్బంది కొరత.. 12,700 పోస్టులు ఖాళీ

  1. ఏళ్ల తరబడి నో రిక్రూట్‌మెంట్
  2. ఒక్కో బస్సుకు ఐదుగురి చొప్పున అవసరం ప్రస్తుతం ఉన్న సిబ్బంది 3.74 మాత్రమే
  3. డ్రైవర్లు, కండక్టర్లపై పని ఒత్తిడి 15 నుంచి 16 గంటలు డ్యూటీ
  4. ప్రయాణికులకూ తప్పని ఇబ్బందులు

హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): ప్రయాణికుల రద్దీకి తగ్గట్లుగా బస్సులు పరుగులు పెడుతున్నా.. వాటిని నడిపేందుకు డ్రైవర్లు, ఇతర సిబ్బంది లేక ఆర్టీసీ సతమతమవుతోంది. సంస్థలో దాదాపు 12,700 పోస్టులు ఖాళీగా ఉండటంతో, ఉన్న ఉద్యోగులపై పనిభారం పెరిగి ప్రయాణికుల సేవలకు ఆటంకం కలుగుతోంది. కష్టాల నుంచి ఆర్టీసీని గట్టెక్కించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిన ట్టుగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 30 నెలల ప్రజాపాల నలో ఆర్టీసీ ప్రగతిపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల సమీక్ష జరిపి.. సంస్థను కష్టాల నుంచి ఒడ్డుకు తీసుకొస్తున్నామని చెప్పుకొచ్చారు. కానీ, మంత్రి వెల్లడించిన గణాంకాల్లోనే ఆర్టీసీ మరింత కష్టాల్లోకి వెళ్లిపోతున్న సంకేతాలు స్పష్టంగా కనబడుతున్నాయి. 

అత్యధిక మందికి ఉపాధి..

రాష్ట్రంలో అత్యధిక మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్న సంస్థ ల్లో విద్యుత్, సింగరేణి తరువాత ఆర్టీసీదే స్థానం. మొదటి నుంచి చూసుకుంటే ఒక బస్సును కొత్తగా సంస్థలోకి తీసుకొస్తే ఐదుగురికి ఉపాధి లభిస్తుందనేది సూత్రం. వాస్తవానికి ఆర్టీసీలో బస్సులు, ఉద్యోగుల సంఖ్య కూడా ఈ సూత్రానికి అనుగుణంగానే కనపడుతూ ఉంటుంది. కొత్తగా ఒక బస్సుతో ఇద్దరు కండక్టర్లు, ఇద్దరు డ్రైవర్లు, ఒక శ్రామిక్‌కు అవకాశం కలుగుతుందని కార్మిక వర్గాలు చెబుతుంటాయి. అదే సూత్రం ప్రకారం ప్రభుత్వం కూడా గతంలో రిక్రూట్‌మెంట్‌లు నిర్వహించేది. వాస్తవానికి ప్రస్తుతం ఒక బస్సుకు ఐదుగురు సిబ్బంది అనే సూత్రం పనిచేయట్లేదు.

ఉన్నది 38,128 మంది ఉద్యోగులే.. 

ప్రస్తుతం ఆర్టీసీలో 10,173 బస్సులు ఉన్నాయి. బస్సుకు ఐదుగురు చొప్పున ఉండాలనే నిబంధన  చూస్తే కనీసం 50,800 మంది ఉద్యోగులు, సిబ్బంది ఉండాలి. కానీ, ప్రస్తుతం కేవలం 38,128 మంది మాత్రమే ఉన్నా రు. అంటే.. ఒక్కో బస్సుకు 3.74 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఈ లెక్కన 12,700 పైగా ఖాళీలు ఉన్నాయి. గడిచిన పుష్కర కాలంగా ఆర్టీసీలో రిక్రూట్‌మెంట్‌లు లేవు. అరకొర సిబ్బంది కారణంగా ఉన్న వారిపై తీవ్ర ఒత్తిడి పడుతోందని కార్మికులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రిక్రూట్‌మెంట్ ఏదీ?

2014లో ఆర్టీసీలో 56,000 మందికిపైగా ఉద్యోగులు ఉండేవారు. గడిచిన పుష్కర కాలంలో 18 వేల మందికిపైగా ఉద్యోగులు రిటైర్డ్ అవ్వడం, వీఆర్‌ఎస్ తీసుకోవడం, అనారోగ్యం కారణంగా రిజైన్ చేయడం జరిగింది. కానీ ఆ స్థాయిలో రిక్రూట్‌మెంట్‌లు లేవని కార్మిక సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న 10,173 బస్సులకు అనుగుణంగా 50800 మం ది ఉద్యోగులు ఉండాలి. కానీ, కేవలం 38128 మంది మాత్రమే ఉన్నారు. రిక్రూట్‌మెంట్ చేస్తే మరో 12,700 మందికిపైగా ఆర్టీసీలో ఉపాధి లభించే అవకాశం ఉందని కార్మికులు అంటున్నారు.

కొద్దికాలం క్రితం 3 వేల మం దికి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. ఒక పక్క బస్సుల సంఖ్యకు అనుగుణంగా సిబ్బందిని నియమించకపోగా.. మరోవైపు ఈవీ బస్సుల రూపంలో ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతుండటం సంస్థలోని కార్మికవర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది. సిబ్బంది కొరత వల్ల ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. గంట ల కొద్దీ నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

2014 నుంచి నిర్లక్ష్యమే..

2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆర్టీసీ అంటే ప్రభుత్వాలకు నిర్లక్ష్యం మొదలైందని కార్మిక సంఘాలు వాపోతు న్నాయి. అప్పటి నుంచి అదే ఒరవడి కొనసాగుతూ.. ప్రస్తుత ప్రభుత్వం వచ్చేసరికి ప్రైవేటీకరణ దిశగా సాగుతుందని కార్మికులు కుండబద్దలు కొడుతున్నారు. ప్రతి రోజూ 35 లక్ష ల కిలోమీటర్ల దూరం ఆర్టీసీ బస్సు లు ప్రయాణిస్తూ.. 61 లక్షల మందికిపైగా ప్రయాణిలకును వారి గమ్య స్థానాలకు చేర్చుతున్నాయి. అంటే సగటున ఒక్కో బస్సు రోజుకు 344 కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తుంది.

ఒక బస్సు 344 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలంటే కనీసం 13 నుంచి 15 గంటలు పడుతుంది. అంటే అన్ని గంటలపాటు ఒక్కడే డ్రైవర్, కండక్టర్   పని చేయాల్సి వస్తోంది. పేరుకే 8 గంటల డ్యూటీ.. కానీ 15 నుంచి 16 గంటల పాటు విధులు నిర్వర్తించాల్సి వస్తోందని కార్మికులు అంటున్నారు. దీనితో సరైన విశ్రాంతి, నిద్రలేకపోవడంతో ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతుందని వాపోతున్నారు.