నాటోకు రాం రాం
- ఇరాన్‌పై యుద్ధంలో సహకరించడం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండిపాటు
- రెండు వారాల్లో యుద్ధాన్ని ముగిస్తామని ప్రకటన
- ఈ యుద్ధంతో మాకు సంబంధం లేదు: బ్రిటన్
- బహ్రెయిన్ అమెజాన్ సెంటర్ లక్ష్యంగా ఇరాన్ క్షిపణి దాడి
- మళ్లీ దాడులు చేయబోమని హామీ ఇస్తే ఆపేస్తాం: ఇరాన్
వాషింగ్టన్/టెహ్రాన్, ఏప్రిల్ 1: నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) నుంచి అమెరికా వైదొలగనుందా?. మిత్రదేశాల కూటమికి రాం రాం చెప్పాలని ఆలోచిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఇరాన్‌పై యుద్ధంలో నాటో దేశాలు తమకు సహకరించడం లేదని, అందుకే ఆ కూటమి నుంచి తప్పుకునేందు కు యోచిస్తున్నామని వెల్లడించారు. యుద్ధం రెండు మూడు వారాల్లో ముగుస్తుందని స్పష్టం చేశారు.
ఇరాన్ నుంచి త్వరగా వైదొలుగుతామని ట్రంప్ మళ్లీ పునరుద్ఘాటించారు. అవసరమైతే ‘స్పాట్ హిట్స్‘ కోసం తిరి గి రావచ్చని కూడా అన్నారు. మరోవైపు బహ్రెయిన్‌లోని అమెజాన్ సెంటర్ లక్ష్యంగా ఇరాన్ క్షిపణి దాడి చేసింది. ఇలా ఉండ గా, ట్రంప్ వ్యాఖ్యలకు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ స్పందిస్తూ.. యుద్ధంతో మాకు సంబంధం లేదని, మమ్ములను ఈ వివాదంలోకి లాగొద్దని, మాపై, నాటోదేశాలపై తీవ్ర ఒత్తిడి ఉందని స్పష్టం చేశారు.
ఈ మేరకు నాటో నుంచి అమెరికా వైదొలిగే ఆలోచనలో ఉన్నట్లు బ్రిటన్‌కు చెందిన ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ అనేక కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై అమెరికా- చేపట్టిన సైనిక చర్యకు మిత్రదేశాలు మద్దతు ఇవ్వ డం లేదని.. వాళ్లు విఫలమైనందు వల్లే ఆ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. నాటో కూటమిని కాగితపు పులిగా అభివర్ణించారు ట్రంప్, ఈ విషయం రష్యా కూ తెలుసునని అన్నారు.
నాటో విశ్వసనీయతపై తనకు ఎప్పటి నుంచో చాలా సందే హాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఆ కూట మి మాటలకు తానెప్పుడూ ప్రభా వితం కాలేదని చెప్పారు. ఈ సందర్భంగా బ్రిటన్ యుద్ధనౌకల దుస్థితిపై ట్రంప్ నేరు గా విమర్శలు గుప్పించారు. ‘మీకు నావికాదళమే లేదు. మీరు చాలా పాతబడిపోయారు. పై గా మీ వద్ద పనిచేయని విమాన వాహక నౌకలు ఉండేవి’ అని ఎద్దేవాచేశారు.
యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ రక్షణ వ్యయాన్ని పెంచాలా? అని సదరు రిపోర్టర్ ప్రశ్నించగా.. తానేమీ సలహా ఇవ్వనని, ఆయనకు ఇష్టం వచ్చింది చేసుకోవచ్చని అన్నారు. అమెరికా ఉక్రెయిన్ విషయంలో వారికి (నాటో దేశాలకు) అండగా నిలిచిందని, కా నీ ఇరాన్ విషయంలో వారు తమకు మద్దతుగా నిలవలేదని ట్రంప్ ఆరోపించారు. ఆయన అభిప్రాయానికి అమెరికా విదేశాం గ మంత్రి మార్కో రూబియో కూడా మద్ద తు తెలిపారు.
‘మనకు అవసరమైనప్పుడు సైనిక స్థావరాలను నిరాకరించే మిత్రదేశాలతో కూటమి వల్ల ప్రయోజనం ఏమిటి?’ అని ప్రశ్నించారు. ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో స్పెయిన్, ఫ్రాన్స్ వంటి దేశాలు తమ సైనిక స్థావరాలను, గగనతలాన్ని ఉపయోగించుకోవడానికి అమెరికాకు అనుమ తి ఇవ్వని విషయం తెలిసిందే. హోర్ముజ్ జలసంధిని తెరిపించేందుకు కలిసి రావాలని చేసిన విజ్ఞప్తిని నాటో పట్టించుకోలేదు. దీంతో ట్రంప్ ఆ దేశాలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేస్తున్న విషయం తెలిసిందే.
బ్రిటిష్ జాతీయ ప్రయోజనాలకే..
ట్రంప్ వ్యాఖ్యలపై బ్రిటన్ ప్రధాని స్టార్మర్‌ను సదరు పత్రిక ప్రశ్నించగా.. నాటోకు తమ దేశం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. నాటో కూటమిని ఇప్పటివరకూ ప్రపంచం చూసిన అత్యంత సమర్థవంతమైన ఏకైక సైనిక కూటమిగా ఆయన అభివర్ణించారు. కానీ యుద్ధంతో మాకు ఎటువంటి సంబం ధం లేదని, కొన్ని రోజులుగా తనపై, నాటో దేశాలపై ఎంతో ఒత్తిడి మాత్రం ఉందన్నా రు. తాను తీసుకునే ఏ నిర్ణయమైనా బ్రిటిష్ జాతీయ ప్రయోజనాల కోసమేనని స్టార్మర్ స్పష్టం చేశారు.
బయటి ఒత్తిళ్లకు తలొగ్గే ప్రస్తకే లేదని వెల్లడించారు. ‘ఇది మా యుద్ధం కాదని, దీంట్లోకి మమ్మల్ని లాగొద్దని, మీరు ఎంత ఒత్తిడి చేసినా ఫలితం ఉండదని ట్రంప్‌నకు స్పష్టం చేశారు. ఇటీవల ఇజ్రాయెల్--అమెరికా దాడుల అనంత రం, ఇరాన్ కీలకమైన హర్మూజ్ జలసంధిని దిగ్బంధించింది. ప్రపంచ ఇంధన రవాణాలో అత్యంత కీలకమైన ఈ మార్గం మూతపడటంతో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఆకాశాన్నంటాయి.
ఈ ప్రభావం బ్రిటన్‌లోని సామాన్యుల జీవన వ్యయంపై కూడా పడుతోందని స్టార్మర్ అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, ‘నాపై ఎంత ఒత్తిడి వచ్చినా, ఎలాంటి గొడవ జరిగినా నేను కేవలం బ్రిటి ష్ జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే నిర్ణయాలు తీసుకుంటాను. అందుకే ఇది మా యుద్ధం కాదని స్పష్టం చేస్తున్నా’ అని స్పష్టంచేశారు.
అయితే, బ్రిటన్ పూర్తిగా ప్రేక్షకపాత్ర పోషించబోదని కూడా ఆయన సంకేతాలిచ్చారు. హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించేందుకు దౌత్యపరమైన చర్య లు చేపడతామని తెలిపారు. ఇందులో భాగంగా విదేశాంగ మంత్రి యెవెట్ కూపర్ నేతృత్వంలో ఒక అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తామని ప్రకటించారు.
హామీ ఇస్తే ఆపేస్తాం: ఇరాన్
ఇజ్రాయెల్--అమెరికాతో జరుగుతున్న యుద్ధం ముగింపునకు తాము సిద్ధంగా ఉ న్నామని, అయితే తమకు కొన్ని బలమైన హామీలు కావాలని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ పేర్కొన్నారు. తాజాగా యూరో పియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాతో ఆయన ఫోన్లో మాట్లాడారు. యుద్ధం ముగింపు గురించి పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారని ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతం కావనే హామీ ఇస్తే, యుద్ధం ముగిం చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆంటోనియో కోస్టాతో పెజెష్కియాన్ అన్నారని పేర్కొంది.
ఇరాన్ నుంచి బయటకు వచ్చేస్తాం: ట్రంప్
ఇరాన్ యుద్ధం ఎప్పుడు ముగిసినట్లుగా అమెరికా భావిస్తుందనే ప్రశ్నకు రాయిటర్స్‌తో ట్రంప్ సమాధానమిస్తూ, ‘నేను మీకు కచ్చితంగా చెప్పలేను.. మేము చాలా త్వరగా బయటకు వచ్చేస్తాం’అని అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం మాట్లాడుతూ, అమెరికా ‘చాలా త్వరగా ఇరాన్ నుంచి బయటకు వస్తుందని అవసరమైతే ‘స్పాట్ హిట్స్‘ కోసం తిరిగి రావచ్చని అన్నారు. నాటో నుంచి అమెరికాను ఉపసంహరించుకునే ప్రయత్నాన్ని తాను ‘కచ్చితంగా‘ పరిశీలిస్తున్నానని కూడా ఆయన మళ్లీ స్పష్టం చేశారు.
ఈ ప్రాంతంలో అమెరికా తీసుకున్న చర్యల వల్ల ఇరాన్‌కు అణ్వాయుధం ఉండదని ట్రంప్ స్పష్టం చేశారు. ‘వారికి అణ్వాయుధం ఉండదు, ఎందుకంటే ప్రస్తుతం వారికి ఆ సామర్థ్యం లేదు. ఆ తర్వాత నేను వెళ్లిపోతాను, అందరినీ నాతో పాటు తీసుకెళ్తాను. అవసరమైతే, అక్కడక్కడా దాడులు చేయడానికి తిరిగి వస్తాం’ అని ట్రంప్ వెల్లడించారు. యుద్ధ పరిస్థితిపై అమెరికన్లను ఉద్దేశించి ఆయన ప్రసంగించడానికి కొన్ని గంటల ముందు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అంతకుముందు, ట్రంప్ మాట్లాడుతూ, తన పూర్వ అధ్యక్షుల కంటే ‘చాలా తక్కువ తీవ్రవాద భావాలున్న’ ‘చాలా తెలివైన’ ఇరాన్ అధ్యక్షుడు మొజ్తాబా పెజిష్కియాన్ కాల్పుల విరమణ కోరుకుంటున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. హోర్ముజ్ జలసంధి ‘తెరిచి, స్వేచ్ఛగా, స్పష్టంగా’ ఉన్నప్పుడే కాల్పుల విరమణ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.




