2 August, 2026 | 9:28 AM

చంద్రబాబుతో పోటీపడే అవకాశం వచ్చింది: సీఎం రేవంత్ రెడ్డి

22-06-2024 02:03 PM

అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాలు పోటీ పడాలి

తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికి ఆదర్శం కావాలి

హెల్త్ టూరిజం హబ్ లో బసవతారకం ఆస్పత్రికి స్థలం

హైదరాబాద్: బసవతారకం ఆస్పత్రి లక్షలాది మందికి సేవలందిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ 24వ వార్షికోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి, మేనేజింగ్ ట్రస్టీ నందమూరి బాలకృష్ణ, డాక్టర్ నోరి దత్తాత్రేయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... బసవతారకం ఆస్పత్రిని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దారని రేవంత్ రెడ్డి కొనియాడారు. నిస్వార్థంగా పేదలకు సేవలందించేందుకు ఆస్పత్రిని నిర్మించారని చెప్పారు. చంద్రబాబుతో అభివృద్ధిలో పోటీ పడే అవకాశం తను వచ్చిందని సీఎం రేవంత్ పేర్కొన్నారు.

చంద్రబాబు 18 గంటలు పనిచేసి తాను 12 గంటలు పనిచేస్తే సరిపోదని చెప్పారు. రాష్ట్ర నేతలు, అధికారులు కూడా 18 గంటలు పనిచేయాల్సిందేనని సీఎం ఆదేశించారు. అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాలు పోటీ పడాలన్నారు. తెలుగు రాష్టాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని సీఎం ఆకాంక్షించారు. హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాం.. శంషాబాద్ లో 500- 1000 ఎకరాల్లో హబ్ ఏర్పాటుకు యోచన ఉన్నట్లు తెలిపారు. హెల్త్ టూరిజం హబ్ లో బసవతారకం ఆస్పత్రికి స్థలం కేటాయిస్తామని సీఎం తెలిపారు. బసవతారకం సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు.