విద్య అభివృద్ధికి ప్రభుత్వం కృషి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
బెల్లంపల్లి,(విజయక్రాంతి): ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేస్తూ విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని తాండూర్ మండల కేంద్రంలో విద్య, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబా పూలే వసతి గృహ నిర్మాణానికి బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్, మండల తహసిల్దార్ జ్యోత్స్న, మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్, మహాత్మ జ్యోతిబాపూలే ఆర్సీఓ బాల భాస్కర్ లతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలలలో త్రాగునీరు, విద్యుత్, ప్రహరీ గోడ, మూత్రశాలలు ఇతర పూర్తి సౌకర్యాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ క్రమంలో తాండూర్ మండలంలో రూ.1 కోటి 95 లక్షల ఎస్ డి ఎఫ్ నిధుల అంచనా వ్యయంతో మహాత్మ జ్యోతిబాపూలే వసతి గృహ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలలో విద్యార్థినీ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనాన్ని మెనూ ప్రకారం అందించడం జరుగుతుందని తెలిపారు.
విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు అందించడం జరుగుతుందని, ప్రభుత్వ పాఠశాలలను విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం బెల్లంపల్లి పట్టణంలోని రామ్ నగర్ ప్రాంతంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అదనపు తరగతి గదులను జిల్లా కలెక్టర్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్, బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ రమేష్, మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి, మండల విద్యాధికారి లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్య, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రూ. 13 లక్షల 50 వేల తో సమగ్ర శిక్ష అంచనా నిధులతో పాఠశాల అదనపు తరగతి గదులు నిర్మించడం జరిగిందని తెలిపారు. గదుల నిర్మాణ పనులను వేగవంతం చేసి విద్యా సంవత్సరం ప్రారంభంలోగా పూర్తి చేసేందుకు అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. విద్యా వ్యవస్థలో ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.






