విశాల ఐక్య ఉద్యమాలకు రైతాంగం ముందుకు రావాలి
- ఏనుగు చంద్రారెడ్డి పిలుపు
గుండాల,(విజయక్రాంతి): మండల కేంద్రంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశాన్ని కల్తి వెంకటేశ్వర్ల అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏనుగు చంద్రారెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయ రంగం నేడు సంక్షోభంలో ఉందని, రైతు కూలీల ఐక్య ఉద్యమాల ద్వారా మాత్రమే వ్యవసాయాన్ని కాపాడుకుంటూ రైతులను రక్షించుకోగలుగుతామని అన్నారు. ఈ వర్షాకాలం సీజన్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 6 లక్షల 50 వేలకు పైగా ఎకరాలలో పంటలు పండించబోతున్నారని, ప్రభుత్వ అంచనా ప్రకారం పత్తి 2 లక్షల 25 వేల ఎకరాలు, వరి 1 లక్ష 75 వేల ఎకరాలు, మొక్కజొన్న ఒక లక్ష ఎకరాల్లో వేయనున్నారని, ఆయిల్ ఫామ్ దాదాపు లక్ష ఎకరాల్లో పంటకు సిద్ధం చేస్తున్నారని తెలిపారు.
ఇవే కాకుండా మిర్చి, కూరగాయలు, పండ్ల తోటలు, జామాయిలు తోపాటు ఇతర పంటలు ఉన్నాయని, నాలుగు వేల మట్టి నమూనాలు సేకరించి భూ పరీక్షలు కూడా నిర్వహించామని అధికారులు ప్రకటించి ఉన్నారని, జిల్లా రైతులకు. అవసరమైన ఎరువులు, పురుగు మందులపై అధికారులకు స్పష్టత ఉన్నప్పటికీ వీటి నిల్వలపై అధికారులు ఇంతవరకు స్పష్టమైన ప్రకటన చేయలేదని అన్నారు. వెంటనే నిల్వలపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గత సీజన్లో యూరియా కొరత మాత్రమే ఉండేదని, కానీ ఈ సీజన్లో డీఏపీ తో సహా ఇతర కాంప్లెక్స్ ఎరువుల కొరత కూడా ఏర్పడినట్లు రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఎరువుల కొరత తీవ్రంగా ఉందని, సగం ఎరువులు కూడా నేటికీ అందుబాటులోకి రాలేదని ప్రచారం జరుగుతుందని, ప్రభుత్వం ఎరువుల నిల్వలపైన, ధరలపైన స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. బ్లాక్ మార్కెట్ వ్యాపారులపైన, నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రాకుండా సంబంధిత అధికారులు ముఖ్యంగా విజిలెన్స్ అధికారులు బాధ్యత తీసుకోవాలని కోరారు. లైసెన్స్ లేని వ్యాపారులను కట్టడి చేయాలని డిమాండ్ చేశారు.
ఎరువుల రేట్ల తోపాటు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగటం వల్ల 2025 వర్షాకాలం సీజన్తో పోల్చుకుంటే 2026 సీజన్లో ఉత్పత్తి ఖర్చులు 50% పెరగనున్నాయని, వ్యవసాయం ఒక పండగ కానీ దండగగా ఈ పాలకులు మార్చారని విమర్శించారు. రైతు సోదరులు తమను తాము కాపాడుకొనుటకు విశాలఐక్య ఉద్యమాలకు కోసం ముందుకు రావాలని కోరారు. ఈ అంశాలపై ప్రభుత్వం, అధికారుల నుండి స్పష్టమైన ప్రకటనను డిమాండ్ చేస్తూ జూన్ 15 నుండి 25 తేదీల వరకు గ్రామ స్థాయి నుండి మండల స్థాయిలలో ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కార్యవర్గం నిర్ణయించిందని తెలిపారు.






