మహిళాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
మహబూబాబాద్, మార్చి 8 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం మహిళాభివృద్ధికి పెద్దపీట వేస్తోందని, ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు రాజకీయ రంగంలో మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్, డీసీసీ అధ్యక్షురాలు డాక్టర్ భూక్యా ఉమ అన్నారు.
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో విభిన్న రంగాల్లో రాణిస్తున్న మహిళలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిందని, ఆర్థికంగా బలోపేతం కావడానికి మహిళా సంఘాలకు సమాఖ్య భవనాలను నిర్మిస్తోందని చెప్పారు.
అలాగే పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు, మహిళా శక్తి క్యాంటీన్లు, ఇతర రంగాల్లో ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు వడ్డీ లేని రుణాలను అందజేస్తుందని చెప్పారు. అలాగే మహిళల పేరుతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, ఇందిరమ్మ నిర్మించి ఇచ్చి వారి పేరుతోనే పట్టాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని కోరారు.




