14 July, 2026 | 11:10 PM

ఉజ్వల భవిష్యత్తుకై ఏం చేయాలి?

29-04-2024 12:22 AM

ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి?  విద్యార్థుల సందేహాలు తీర్చే సమగ్ర కథనం

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): పదో తరగతి పరీక్షలు అయిపోయాయి. ఇప్పుడు విద్యార్థులంతా బంగారు భవిష్యత్తు కోసం ఉన్నత విద్య గురించి కలలు కంటూ ఉంటారు. ఏ కోర్సు ఎంచుకోవాలి? ఏ కాలేజీలో చేరాలి? ఎటువైపు వెళ్తే కలలను త్వరగా సాకారం చేసుకోవచ్చు? ఏ రంగంలో ఎక్కువ ఉద్యోగావకాశాలున్నాయి? సొంతంగా వ్యాపారాలు మొదలుపెట్టాలంటే ఏంచేయాలి? తదితర ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. పట్టణ ప్రాంతాల విద్యార్థులు ఐటీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, నిర్మాణరంగం వైపు ఉపాధి చూపే కోర్సుల్లో చేరేందుకు అమితాసక్తి చూపుతున్నారని ప్రముఖ కెరీర్ నిపుణుడు, అమెరికన్ ఇండియన్ ఫౌండేషన్ ట్రైనింగ్ కో ఆర్డినేటర్ రమేష్ గట్టు తెలిపారు. 

అన్నీ సందేహాలే

పది తర్వాత భవిష్యత్తు గురించి విద్యార్థుల మస్తిష్కంలో లెక్కకు మిక్కిలి సందేహాలు, ప్రశ్నలు పుట్టుకొస్తాయి. ఆర్ట్స్, కామర్స్, సైన్స్/మ్యాథ్స్‌లో ఎటువైపు వెళ్లాలి అన్న డోలాయమానంలో ఉంటారు. ఆర్ట్స్‌ను ఎంచుకుంటే పరిస్థితి ఏమిటి? కామర్స్, సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులు చదివితే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? అనే అంశాలు ప్రతి విద్యార్థికి తెలిసి ఉండాలి. 

ఇంటర్‌లో ఏ గ్రూప్ చదవితే భవిష్యత్తు

పదో తరగతి తర్వాత జీవిత లక్ష్యాన్ని చేరుకోవడంలో ఇంటర్మీడియట్‌లో ఎంపిక చేసుకునే గ్రూప్ కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల అమ్మనాన్న, స్నేహితులు, సీనియర్లు, శ్రేయోభిలాషుల సలహాలను పరిగణనలోకి తీసుకుంటూనే స్వీయ సామర్థ్యం, కుటుంబ ఆర్థిక పరిస్థితి వంటివాటిని దృష్టిలో ఉంచుకుని గ్రూపు ఎంపిక చేసుకోవాలి. భవిష్యత్తులో సాధించాల్సిన లక్ష్యాలపై స్పష్టమైన అవగాహన, వాటి సాధనకు సరితూగే కార్యాచరణ ఉంటే ఏ గ్రూపు ఎంచుకున్నా కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది. ఇండియా, విదేశాల్లో ఏ కోర్సులకు డిమాండ్ ఉంది? స్టెమ్ (STEM) సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెడిసిన్ సబ్జెక్టులను ఎందుకు ఎంచుకోవాలి? ఆర్థిక అక్షరాస్యత (ఫైనాన్సియల్ లిటరసీ), కెరీర్ గైడెన్స్, అకడమిక్ బ్యాక్ గ్రౌండ్, నిపుణులు ఏం చెప్తున్నారనే అంశాలను ప్రతి విద్యార్థి పరిగణనలోకి తీసుకోవాలి. 

ఆర్ట్స్‌లో ఏ గ్రూప్ తీసుకుంటే మంచిది?

ఆర్ట్స్‌లో హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, లాంగ్వేజెస్, మ్యూజిక్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎకనమిక్స్, హోమ్‌సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫైన్‌ఆర్ట్స్ లాంటి సబ్జెక్టులుంటాయి. కోర్సు కాంబినేషన్‌లో ఏయే అంశాలను చదవాలనేదానిపై కుటుంబసభ్యులు, నిపుణుల సూచనలను తప్పనిసరిగా పాటించటం మంచిది.

కామర్స్‌కు ఢోకా లేదు

కామర్స్‌ను ఎంచుకున్న విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. చార్టెడ్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ (సీఎస్) ట్రైనింగ్, ఎకనామిక్స్ అంశాలను చదవడం వల్ల విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తారు. అయితే ఇందులో ప్రధానంగా మ్యాథ్స్ సబ్జెక్టు ఉంటుంది. ఎకనామిక్స్, ఇంగ్లిష్, అకౌంటెన్సీ, బిజినెస్ స్టడీస్/ ఆర్గనైజేషన్ ఆఫ్ కామర్స్, మ్యాథమెటిక్స్, ఇన్ఫర్మేషన్ ప్రాక్టీసెస్, స్టాటిస్టిక్స్ ప్రధానాంశాలుంటాయి. 

పది తర్వాత ప్రభుత్వ ఉద్యోగావకాశాలు

సైన్యం, నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ కోస్ట్‌గార్డ్స్, బీఎస్‌ఎఫ్, ఇండియన్ రైల్వేస్, మున్సిపల్ కార్పొరేషన్స్, పీఎస్‌యూఎస్ ఉద్యోగాల్లో చేరితే సమయానికి జీతభత్యాలు, రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ సదుపాయాలుంటాయి. డిప్లొమా కోర్సులతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ కోర్సుల్లో చేరితే స్కూల్ స్థాయిలో చదివిన అంశాలు ఉపయోగకరంగా ఉంటాయి. పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇంజినీరింగ్ అంశాలను చదవాల్సి ఉంటుంది. డిప్లామా ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్(డీఎంఈ), డిప్లామా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ టెక్ట్స్‌టైల్ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ ఎన్విరాన్‌మెంట్ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, డిప్లొమా ఇన్ మైనింగ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ పెట్రోలియం ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ సేఫ్టీ టెక్నాలజీ సబ్జెక్టులుంటాయి. వీటిని చదవడం వల్ల త్వరగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.

వొకేషనల్ కోర్సులతో భవిష్యత్తు ఉంటుందా?

ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్(ఐటీఐ)లో మంచి ట్రేడ్‌ను సెలక్ట్ చేసుకున్నవారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. వృత్తివిద్యా కోర్సులు చదివితే నైపుణ్యాలు వృద్ధిచెందడం వల్ల ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఐటీఐలో ఎలక్ట్రిషన్, ఫైర్‌మెన్, వెల్డర్, వైర్‌మెన్, మెకానిక్, టర్నర్ నిపుణులకు ఉపాధి అవకాశాలు అధికంగా ఉన్నాయి. 

పారామెడికల్ కోర్సుల్లో చేరితే

భవిష్యత్తు ఉంటుందా? 

పది తర్వాత అనేక పారామెడికల్ డిప్లొమా కోర్సులకు డిమాండ్ ఉంది. అనేక ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్స్‌రే అసిస్టెంట్లుగా చేరవచ్చు. ఈసీజీ టెక్నాలజీ, ఎక్స్‌రే టెక్నాలజీ, డయాలసిస్ టెక్నాలజీ, ఫిజియోథెరపీ, డెంటల్ హైజినిస్ట్ మొదలైన కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సర్టిఫికెట్ కోర్సులు అనేకం ఉన్నాయి. ఇందులో ప్రధానంగా ఎక్స్‌రే/రేడియాలజీ అసిస్టెంట్, మెడికల్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, నర్సింగ్ కేర్ అసిస్టెంట్, ఈసీజీ అసిస్టెంట్, డెంటల్ అసిస్టెంట్, సీటీస్కాన్ టెక్నిషియన్, డయాలసిస్ టెక్నీషియన్, ఎంఆర్‌ఐ టెక్నిషియన్ కోర్సులు చదివిన వారికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. 

సైన్స్ గ్రూప్స్‌తో ఉజ్వల భవిష్యత్తు

సైన్స్ సబ్జెక్టుల్లో ప్రధానంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్‌తోపాటు మ్యాథమెటిక్స్, బయాలజీ, ఇంగ్లిష్, కంప్యూటర్ సైన్స్‌ను చదవాల్సి ఉంటుంది. ఆర్థికంగా ఉన్నవారు ఎక్కువగా సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల వైపు చూస్తున్నారు. ఉద్యోగ భద్రత, పక్కాగా జాబ్ ఉండేలా ప్రణాళికతో తమ పిల్లలను చదవిస్తున్నారు. దక్షిణ భారతంలో ఇలాంటి సంప్రదాయం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఐటీ ప్రొఫెషనల్స్‌గా ఎదగడానికి దోహదం చేస్తున్నారు. 2011 తర్వాత ఐటీలో ఉద్యోగ భద్రత అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం పెద్ద కంపెనీలు సైతం రూ.30 వేలు, రూ.25 వేల జీతాలతోనే సరిపెడుతున్నాయి. అందవల్ల ప్రస్తుత విద్యార్థులు విదేశాల్లో డిమాండ్ ఉన్న కోర్సులను ఎంచుకుంటున్నారు.

డ్రీమ్ బిగ్.. వర్క్‌హార్డ్

విద్యార్థులు ఏ కోర్సులను ఎంచుకున్నా ప్రస్తుతం ఉ పాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సబ్జెక్టు తీసుకున్నామనే అంశం ముఖ్యం కాదు. బిగ్ డ్రీమ్ ఉండి.. హార్డ్‌వర్క్‌తోనే కలలు సాకారం అవుతాయి. రోజులో 24 గంటల్లో 18 గంటలు శ్రమిస్తేనే ఏదైనా సాధ్యం. కెరీర్ గైడెన్స్ కేవలం రోల్ ప్లే మాత్రమే. ఐటీ, అగ్రికల్చర్, నిర్మాణరంగం, మెడికల్, ఇంజినీరింగ్ తీసుకున్నా మనేది ముఖ్యం కాదు. విషయ పరిజ్ఞానంతో పాటు నైపుణ్యం ఉంటేనే రాణిస్తారు. దీనికి అధిక శ్రమ అవసరం. ఊహించడం తప్పుకాదు.. ఊహ ల్లో విహరించొద్దు.

 గట్టు రమేష్, మాస్టర్ ట్రైనర్ 


ఐఏఎస్ కావాలని ఉంది

ఉన్నత చదువులు చదివి ఐఏఎస్ కావాలని ఉంది. సివిల్స్ సర్వీసు పరీక్షలకు ఇప్పటి నుంచే శిక్షణ తీసుకుంటున్నా. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఎంట్రెన్స్ పరీక్షలను 

రాస్తున్నాను. ఇంటర్‌లో చేరితే ఎంపీసీలో చేరాలని అనుకుంటున్నాను. పదో తరగతిలో వచ్చే మార్కుల ఆధారంగా కోర్సును ఎంచుకుంటాను. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందించే 

ప్రోత్సాహం తోనే చదువులో ముందుకెళ్తున్నాను.

 జశ్వంత్‌గౌడ్ (రాజ్‌భవన్‌స్కూల్)