పాక్ కోచ్‌గా కిర్‌స్టన్
లాహోర్: టీమిండియా వన్డే ప్రపంచకప్ అందుకోవడంలో ప్రముఖ పాత్ర పోషించిన కోచ్ గ్యారీ కిర్‌స్టన్.. పాకిస్థాన్ జట్టుకు శిక్షణ ఇవ్వనున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ కోసం గ్యారీని కోచ్‌గా నియమించినట్లు.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆదివారం ప్రకటించింది. ఇక ఆస్ట్రేలియా మాజీ బౌలర్ జాసన్ గిలెస్పీని టెస్టు క్రికెట్ కోచ్‌గా ఎంపిక చేసింది. వీరిద్దరితో పాటు పాక్ మాజీ ఆల్‌రౌండర్ అజర్ మహమూద్‌ను అసిస్టెంట్ కోచ్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ముగ్గురు తమ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగుతారని బోర్డు వెల్లడించింది. కాగా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను సమం చేసిన పాకిస్థాన్ పొట్టి ప్రపంచకప్‌నకు ముందు మరో నాలుగు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.
కివీస్‌తో సిరీస్ డ్రా..
పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ డ్రాగా ముగిసింది. శనివారం జరిగిన ఐదో టీ20లో పాకిస్థాన్ 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్ 2 సమమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. బాబర్ ఆజమ్ (44 బంతుల్లో 69, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. అనంతరం లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ 19.2 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది 4 వికెట్లతో చెలరేగాడు.






