100 కోట్ల ప్రభుత్వ భూమి హాంఫట్!
సర్కారు బోర్డును తొలగించి కబ్జా
అధికార పార్టీ బడా నాయకుల అండ?
పట్టించుకోని వికారాబాద్ జిల్లా తాండూర్ రెవెన్యూ, మున్సిపల్ అధికారులు
తాండూరు, మార్చి 26 (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణం నడిబొడ్డులో ఉన్న దాదాపు 100 కోట్ల రూపాయ లకు పైగా విలువ చేసే ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతున్నది. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి, దుకాణ సముదాయాన్ని సైతం నిర్మిస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ, మున్సి పల్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. పట్టణంలోని సర్వే నంబర్ 111లో దాదా పు 14.14 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది.
అక్రమార్కులు ఈ భూమిపై కన్నేసి అధికార పార్టీకి చెందిన కొందరు బడా నాయకులతో చేతులు కలిపి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రభుత్వ భూమి కబ్జా చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం విజయ విద్యాలయ పాఠశాల మాజీ విద్యా కమిటీ చైర్మన్ లొంక పాండు, పూర్వ విద్యార్థులు అడ్డుకొని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి కోర్టులో కేసు వేశారు. విచారణ చేసిన కలెక్టర్ ఇది ప్రభుత్వ భూమేనని బోర్డు ఏర్పాటు చేశా రు. భూ బకాసురులు మాత్రం బోర్డును పీకేసి దర్జాగా కబ్జా చేశారు. దుకాణ సముదాయాన్ని సైతం నిర్మాణాలు చేపట్టారు. అధికారుల స్పందించి ప్రభుత్వం భూమిని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
వీవీహెచ్‌ఎస్‌లో చదివా..
అది ముమ్మాటికీ ప్రభుత్వ భూమి. నేను ప్రాథమిక విద్య వివిహెచ్‌ఎస్‌లో కొనసాగించాను. విద్య సంస్థతోగాని, భూమితోగానీ ‘ప్రసారం’ కుటుంబానికి సంబంధం లేదు. వారి కుటుంబ సభ్యులు ఎవరు కూడా పాఠశాలలో విద్యను అభ్యసించలేదు. వారిది పేరున్న మంచి కుటుంబం. వారి పేరును ఇందులో ఎందుకు లాగుతున్నారో అర్థం కావడం లేదు.
శ్యాంబాబు గోగిఖర్, పాఠశాల పూర్వ విద్యార్థి
ముమ్మాటికీ ప్రభుత్వ భూమే..
111 సర్వేనంబర్‌లోని ముమ్మాటికీ ప్రభుత్వ భూమి. 14.14 ఎకరాల భూమి ఉండగా మినీ స్టేడియం (ప్రస్తుతం ఆర్డిఓ కార్యాలయం), శ్మశానవాటిక, ధోబి ఘాట్ ఏర్పాటు చేశారు. గత 50 సంవత్సరాల క్రితం వీధి నాటకాలు వేసుకునేందుకుగాను వేదికను ఏర్పాటు చేసుకునేందుకు ప్రసారం బసప్ప అనే వ్యక్తి అప్పటి కర్ణాటక రాష్ట్రం చించోలి తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకున్నాడు.
అనుమతి రావడంతో అక్కడే ఓ షెడ్ ఏర్పాటు చేసి వివిహెచ్‌ఎస్ ప్రైవేటు పాఠశాల ప్రారంభించారు. రికార్డుల్లో ఎక్కడ కూడా భూ యజమాని పేరు లేదు. అధికార పార్టీకి చెందిన కొందరు బడా నాయకులు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డికి తప్పుదోవ పట్టించి ప్రభుత్వ భూమిని స్వాహా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
లొంక పాండు, వీవీహెచ్‌ఎస్ విద్యా కమిటీ మాజీ చైర్మన్
నిర్మాణ పనులను అడ్డుకున్నాం
ప్రభుత్వ భూమిలో అక్రమంగా చొరబడి కబ్జాలు చేసిన వారిని అడ్డుకోవాల్సి న బాధ్యత రెవెన్యూ అధికారులదే. కోర్టు ఆదేశాల మేరకు మేము నిర్మాణ పనులను అడ్డుకున్నాం.
మధుసూదన్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్
నోటీసులు ఇచ్చాం
లొంకపాండు, మొహమ్మద్ షబ్బీ ర్ అనే వ్యక్తులు హైకోర్టులో రేట్ పిటిషన్ దాఖలు చేయగా అందుకుగాను ఏప్రిల్ 24వ తేదీ వరకు అట్టి భూమికి సంబంధించిన అఫిడవిట్ దాఖలు చేయా లంటూ కోర్టు ఆదేశించింది. ఇప్పటికే కబ్జా చేసిన వారికి నోటీసులు కూడా అందించాం. నిర్మాణ పనులు జరగకుండా అడ్డుకుంటాం.
తారాసింగ్, తహసీల్దార్, తాండూర్




