28 April, 2026 | 2:19 AM

రీయింబర్స్‌మెంట్ బకాయిలపై సర్కార్ నిర్లక్ష్యం

28-04-2026 12:00 AM

ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలపై రాష్ట్రప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నది. గత ప్రభుత్వం బకాయిలు పేరుకుపోయేలా చేయగా, తాము అధికారంలోకి వస్తే విద్యా రంగానికి పెద్దపీట వేస్తామని, పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేస్తామని ప్రస్తుత ప్రభుత్వం కూడా తాత్సారమే చేస్తున్నది. నిధుల విడుదల జాప్యం వల్ల విద్యార్థులు హాల్ టికెట్లు అందక, ఫలితాలు వెలువడక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో అసలు ఈ పథకం ఉద్దేశం, ప్రస్తుత పరిస్థితులపై విశ్లేషణ అవసరం. కొత్త విద్యాసంవత్సరం మొదలయ్యేలోపు సర్కార్ పూర్తి బకాయిలు విడుదల చేస్తే బాగుంటుంది. రాష్ట్రం విద్యా వనరులకు నిలయంగా వెలుగొందుతున్నది. ఎన్నో ప్రముఖ విద్యాసంస్థలు ఇక్కడ విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాయి. పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం 2008లో ఫీజు రీయింబ ర్‌మెంట్ పథకం మొదలైంది.

నిరుపేదలకు అందని ద్రాక్షగా ఉన్న ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులు ఈ పథకం వల్ల చేరువయ్యాయి. లక్షలాది మంది విద్యార్థులు పథకం ద్వారా చదువుకుని, ఉన్నతస్థాయికి ఎదిగి దేశ విదేశాల్లో స్థిరపడ్డారు. తమ కుటుంబాలకు ఆర్థికంగా ఆసరాగా నిలుస్తున్నారు. దేశానికి విదేశీ ద్రవ్యాన్ని కూడా సంపాదించి పెడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల అభివద్ధికి ఈ పథకం ఎంతో కీలకం. ప్రస్తుతం ఈ వినూత్న పథకం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది.

ప్రతి ఏటా సుమారు 14 లక్షల మంది విద్యార్థులు ఈ పథకంపై ఆధారపడి చదువుకుంటున్నారు. పథకం అమలుకు ఏడాదికి 2,500 కోట్ల నిధులు అవసరం అవుతాయి. ప్రభుత్వం బడ్జెట్‌లో అరకొర నిధులు కేటాయిస్తూ నిర్లక్ష్యం చేస్తోంది. కేటాయించిన నిధులను సైతం సకాలంలో విడుదల చేయడం లేదు. కొత్త షరతులు విధిస్తూ లబ్ధిదారుల సంఖ్యను తగ్గించే ప్రయత్నం జరుగుతోంది. గత నాలుగేళ్ల నుంచి దాదాపు 10,000 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి.

పాలకపక్షం వైఖరి వల్ల విద్యార్థిలోకం తీవ్ర ఆందోళనలో ఉంది. బకాయిలు విడుదల చేయకపోగా, సర్కార్ ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించిన ఫీజులను యాజమాన్యాలు 35 శాతం వరకు పెంచే విధంగా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం దారుణం. ఈ నిర్ణయం నిరుపేద తల్లిదండ్రులపై పెను భారంగా మారతుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కూడా రాష్ట్ర వాటా అందక వెనక్కి వెళుతున్నాయి. ఫీజులు అందలేదనే నెపంతో కాలేజీ యాజమాన్యాలు హాల్ టికెట్లు ఇవ్వడం లేదు.

దీనివల్ల విద్యార్థులు మానసిక వేదనకు గురై చదువుకు స్వస్తి పలుకుతున్నారు. కొంతమంది విద్యార్థులు ఈ ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నిధుల విడుదల జాప్యం వల్ల కాలేజీ ఫ్యాకల్టీకి జీతాలు అందడం లేదు. వారు ఆకలితో అలమటించే దుస్థితి ఏర్పడింది. విద్యార్థులు చదువు మానేసి చిన్న చిన్న పనులకు వెళ్తున్నారు. పాలకుల వైఫల్యం వల్ల ప్రైవేట్ కళాశాలలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. 

రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్లకు పైగా ఉంది. అందులో ఫీజు రీయింబర్స్మెం ట్ వాటా కేవలం 0.77 శాతం మాత్రమే. ఇంత తక్కువ నిధుల విడుదల లో అలసత్వం వహించడం చాలా దురదృష్టకరం. బకాయిల కోసం యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై స్పష్టమైన కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించి నా ప్రభుత్వం స్పందించలేదు. వచ్చే విద్యా సంవత్సరం 2026 నుంచి విద్యార్థుల నుంచే ఫీజులు వసూలు చేసుకోవచ్చనే జడ్జిమెంట్ వచ్చింది.

ఇది పేద విద్యార్థుల పాలిట శాపంగా మారే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితులకు పాలకుల పరోక్ష సహకారం ఉన్నట్లు కనిపిస్తున్నది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సామాన్యులకు ఉన్నత విద్య దూరం అవుతున్నది. విద్యా రంగం పట్ల చిత్తశుద్ధి లేని పోకడలు సమాజానికి హానికరం. ఇప్పటికైనా పాలకులు స్పందించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడా లి. పెండింగ్‌లో ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేయాలి.

నిరుపేద విద్యార్థులు నిర్భయంగా చదువుకునే వాతావరణం కల్పించాలి. విద్యా వనరులను రాబో యే తరాలకు చేరువ చేయడమే ప్రభుత్వ బాధ్యత కావాలి. అప్పుడే తెలంగాణ విద్యా రంగం మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకుంటుంది. పాలకుల హామీలు మాటలకే పరిమి తం కాకుండా, క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి. బకాయిలను బేషర తుగా విడుదల చేయాలి.

వంశీకృష్ణ గౌడ్