28 April, 2026 | 2:16 AM

కెమెరా కన్ను మలిగింది!

28-04-2026 12:00 AM

మంచో చెడో చూసేవారి, చదివేవారి ఆత్మలను పట్టి పీడిస్తున్నదా అదే సృజనాత్మకత. పెల్లుబికే ఆనందం, అదిమిపట్టే విషాదం వెంటే ఉండేలా, వెన్నంటి ఉందంటే అది నిజమైన సృజనాత్మకత. అటువంటి సృజనాత్మకతకు నిలువెత్తు రూపంగా నిలిచినవాడు రఘురాయ్. రెండేళ్లుగా ప్రొస్టేట్ క్యాన్సర్‌తో పోరాడి తన ౮౩వ ఏట కన్నుమూశాడు. రఘురాయ్ తన జీవితకాలంలో అందించిన అద్భుత ఫొటోలను తలుచుకొని ఫోటో జర్నలిస్టులు దుఃఖంలో మునిగిపోయారు.

ఫొటో జర్నలిస్టుగా రఘురాయ్ పలు ఆంగ్ల పత్రికల్లో పనిచేశారు. వృత్తిపరంగా ఆయన దృష్టి కోణమే వేరు. కనులకు ఆహ్లాదం కలిగించే చిత్రమైనా.. తను ఎంచుకున్న అంశాన్ని లోతుగా తరచి చూపే దృష్టైనా రఘురాయ్ సొంతం. తాజ్‌మహల్ అం టే పోస్ట్‌కార్డ్ చిత్రంగా అందరి కళ్లలో నిలిచిపోయి ఉన్నప్పుడు రఘురాయ్, తాజ్‌మహల్‌ను తన ఫొటోల్లో అనేక భంగిమల్లో చూపి ఆశ్చర్యం కలిగించారు. యమునా నది ఎండిపోయి ఇసుకలో సగం తేలిన ఆవశేషాల యాంగి ల్‌లోనూ అందమైన తాజ్‌మహల్ కనిపిస్తుంది.

వాస్తవం, సౌందర్యం ఒకే ఫ్రేమ్‌లో. ఇప్పటి జెన్ జీ తెలియకపోవచ్చు.. 1971లో బంగ్లాదేశ్ శరణార్థులు అనుభవించిన బాధలు రఘురాయ్ ఫొటోల్లో నిక్షిప్తమై ఉన్నాయి. 1984లో భోపాల్ గ్యాస్ విషాదం దేశాన్ని నివ్వెరపరిచింది. ఆ విషవాయువు పీల్చినవారి జీవితాలు ఛిద్రమయ్యాయి. ఆ మరణ హోమానికి ప్రతీకగా.. ఓ చిన్న శిశువు మృతదేహం ఫొటో యావత్తు దేశాన్ని కలచివేసింది. ఆరు దశాబ్దాల పాటు రఘురాయ్ వేల చిత్రాలను మన ముందుంచి వెళ్లిపోయారు.

దేశ సంస్కృతి, రాజకీయ యువనిక, సామాజిక వాస్తవాలు, ప్రజల పేదరికం.. ఇలా ప్రతి అంశం ఆ ఫొటోగ్రాఫర్ కెమెరా కళ్లలో నిక్షిప్తమైపోతాయి. ఫోటో జర్నలిస్టుగా దేశ ఆధునిక చరిత్రలోని ముఖ్యఘట్టాలెన్నో తన ఫొటోల్లో ప్రపంచం కళ్లకుకట్టారు. ప్రధాని, ఉక్కు మహిళగా పేర్గాంచిన ఇందిరాగాంధీ, ఓ రోజు కుర్చీలో కూర్చుని ఉండగా అంతా పురుష మంత్రులు ఆమె చుట్టూ నించుని ఉన్న ఫొటో ఇందిర అధికారానికి ప్రతీకగా నిలిచింది.

రఘురాయ్ తన ఫొటోలతో డాక్యుమెంటరీల్లాంటి ఎన్నో గ్రంథాలను రూపొందించారు. రచయితగానూ తనదైన ముద్ర వేశారు. ప్రముఖుల జీవితాలను డాక్యుమెంట్ చేయడంలో రఘురాయ్, వారిని ఉన్నతంగా దేశ ప్రజల ముందుం చారు. ఫొటోగ్రఫీకి విశేష సేవలందించిన రఘురాయ్‌ని భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. దేశ ఫొటోగ్రఫీ చరిత్రలో అరుదైన కళాకారుడు రఘురాయ్. ఆయన మరణంతో కెమెరా కన్నుమలిగినట్లయింది.