రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి
– జిల్లా సహకార అధికారి కరుణాకర్
ఆసిఫాబాద్(విజయక్రాంతి): రైతుల ఆర్థికాభివృద్ధి, వ్యవసాయ రంగ బలోపేతానికి సహకార సంఘాలు మరింత సమర్థంగా పనిచేయాలని జిల్లా సహకార అధికారి కరుణాకర్ అన్నారు. భారత ప్రభుత్వ సహకార వారోత్సవాల సందర్భంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS), ఆసిఫాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పైలట్ ప్రాజెక్టు కింద కంది విత్తన ఉత్పత్తి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతులు రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPOలు)లో సభ్యత్వం తీసుకొని డ్రోన్ సేవలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, ఇతర ప్రభుత్వ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాబార్డ్ ప్రతినిధులు, జిల్లా నాబార్డ్ మేనేజర్ వీరభద్రుడు, వ్యవసాయ, సహకార శాఖ అధికారులు, జిల్లా సహకార సంఘాల ప్రతినిధులు, సెక్రటరీలు, రైతులు పాల్గొన్నారు.






