2 September, 2026 | 12:38 AM

సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం

02-09-2026 | 12:00am
  1. మత్స్య సంస్థ చైర్మన్ మెట్టు సాయికుమార్
  2. గాంధీభవన్‌లో ప్రజాపాలన ప్రదర్శన నిర్వహణ

హైదరాబాద్, సెప్టెంబర్ 1(విజయక్రాంతి): తెలంగాణ మత్స్య సంస్థ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం గాంధీ భవన్‌లో ప్రజా పాలనపై ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో జరిగినట్లు పేర్కొంటున్న అవకతవకలు, ప్రజలకు ఎదురైన సమస్యలు, అప్పటి ప్రభుత్వ విధానాలను ఎత్తిచూపుతూ ప్రదర్శన ఏర్పాటు చేశారు.

అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అమలు చేస్తున్న ప్రజా పాలన కార్యక్రమాలు, ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు తీరును ప్రదర్శనలో వివరించారు. గత వెయ్యి రోజుల పాలనలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సంక్షేమ ఫలాలను ప్రజలకు తెలియజేసేలా వివిధ అంశాలను ప్రదర్శనలో పొందుపర్చారు.

ప్రజలకు పారదర్శకమైన పాలన అందించడంతో పాటు సంక్షేమం, అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మెట్టు సాయికుమార్ పేర్కొన్నారు. ప్రజా పాలన ద్వారా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు మరింత చేరువ చేయాల్సిన అవసరం ఉందన్నారు. 

కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొని ప్రదర్శనను పరిశీలించారు. ప్రజా పాలనలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని నాయకులు తెలిపారు.