బ్యాంకులో 7.40 కోట్ల నకిలీ కరెన్సీ
యూపీ సహారన్‌పూర్ పీఎన్బీ ఆడిటింగ్‌లో వెలుగులోకి
లక్నో, సెప్టెంబర్ 1: ఉత్తరప్రదేశ్ సహారన్‌పూర్ సివిల్‌లైన్స్(Uttar Pradesh Saharanpur Civil Lines)లో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్(Punjab National Bank) (పీఎన్బీ)లో రూ. 7.40 కోట్ల నకిలీ కరెన్సీ(Fake Currency) బయటపడింది. నకిలీ కరెన్సీ ఎవరు చేర్చారనే దానిపై దర్యాప్తు చేపట్టినట్లు మంగళవారం బ్యాంకు నోడల్ అధికారి అరుణ్‌కుమార్(Arun Kumar,) పేర్కొన్నారు. సీసీ టీవీ దృశ్యాల(CCTV footage)ను పరిశీలించగా బ్యాంకు హౌస్ కీపర్ విశాల్ కుమార్ నోట్ల కట్టల నుంచి నగదు తీస్తున్నట్లు గుర్తించామని, ఇందులో హస్తం ఉన్న పీఎన్బీ సీనియర్ డివిజనర్ మేనేజర్ రవికుమార్, కరెన్సీ చెస్ట్ మేనేజర్లు సుశీల్ శర్మ, అమిత్ కుమార్లను విధుల నుంచి సస్పెన్షన్ చేశామని తెలిపారు.
బ్యాంకు అధికారులపై శాఖపరమైన విచారణ కూడా నిర్వహిస్తున్నా మని పీఎన్బీ డివిజనల్ కార్యాలయ సీనియర్ మేనేజర్ నిషాసింగ్ వివరించారు. ఆడిటింగ్‌లో నకిలీ కరెన్సీ వ్యవహారం వెలుగు చూసిందని, కరెన్సీ చెస్ట్ నుంచి జైపూర్‌లోని బ్యాంకు ప్రధాన కార్యాలయానికి పంపిన నగదులో రూ. 4.30 లక్షలు తగ్గిందని అధికారులు గుర్తించి సమాచారం అందించారని చెప్పారు.
దీంతో కరెన్సీ చెస్ట్‌లో ఆడిటింగ్ నిర్వహించగా ఈ నకిలీ నోట్ల విషయం బయటపడిందని ఆయన వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. నకిలీ కరెన్సీపై ప్రత్యేక సిట్ బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టామని డీఐజీ అభిషేక్ తెలిపారు. నిందితులు నలుగురిని అరెస్టు చేశామని, దర్యాప్తు కొనసాగుతుందని ఆయన వివరించారు.






