15 April, 2026 | 12:31 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మల్లన్నసాగర్ భూ బాధితులకు ప్రభుత్వ పథకాలు ఇవ్వరంట!

17-06-2025 12:12 AM

-ఏ గ్రామానికి చెందినవారో తేల్చని వైనం

-పథకాల కోసం మున్సిపల్ లో దరఖాస్తులు 

-ఇప్పుడు రావంటున్న అధికారులు అన్నింట అన్యాయానికి 

-గురవుతున్న ముంపు గ్రామాలు 

గజ్వేల్,  జూన్ 16:  మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు అడుగడుగునా అన్యాయమే జరుగుతుంది. గత ప్రభుత్వం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో పునరావాస కాలనీ ఏర్పాటుచేసినా ఇప్పటివరకు వారి అడ్రస్ ఖరారు కాలేదు. తొగుట, కొండపాక మండలాల పరిధిలోని ముంపు గ్రామాలను ఆయా మండల పరిధిలో నుండి అధికారులు తొలగించడంతో పాటు ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులను వేరే గ్రామాలకు బదిలీ చేశారు.

పునరావాసంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకపోగా, గ్రామాలలో ప్రజాసేవల నిర్వహణ ప్రశ్నార్ధకంగా మారింది. మండల పరిషత్ లో ముంపు గ్రామాలను తొలగించిన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో విలీనం చేసినట్లు అధికారికంగా ఖరారు చేయలేదు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో  ముంపు  గ్రామాల ప్రజలను  గజ్వేల్ ప్రాంత ప్రజలు గానే గుర్తించారు. ప్రస్తుతం పునరావాస కాలనీలోని ఆయా గ్రామాలలో పారిశుద్ధ కార్మికులకు, తాగునీటి సరఫరా చేసే సిబ్బందికి నెలల తరబడిగా  వేతనాలు రాకపోవడంతో  ఇబ్బందులకు గురవుతున్నారు.

సింగారం గ్రామంలో చెత్త సేకరణ వాహనాలు కూడా తిరగకపోవడంతో గ్రామం అంతా చెత్త పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతుంది. ప్రభుత్వాలు మారిన ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న ప్లాట్లు, ప్యాకేజీలు రాకపోవడంతో వారి జీవితాలు అగమ్య గోచరంగా మారాయి. ప్రభుత్వం మారితే నైనా  తమ పెండింగ్ పనులు పూర్తవుతాయని నమ్మిన ముంపు గ్రామాల బాధితులకు ఎదురుచూపులే మిగిలాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం  ప్రకటించిన పథకాలకు ముంపు గ్రామాల ప్రజలు అనర్హులుగా మిగిలిపోయారు. పునరావాసంలో పేరుకే గ్రామాలుగా మిగిలి ఉన్న  తమను మున్సిపల్ లో విలీనం చేయకపోవడంతో పథకాలకు అనర్హులని అధికారులు చెబుతున్నారు. పథకాల ప్రారంభంలో ముంపు గ్రామాల ప్రజలను గజ్వేల్  ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా యంత్రాంగం ఆదేశాలు ఇచ్చారు.

కానీ మున్సిపల్ లో విలీనం కాకపోవడంతో ప్రభుత్వ పథకాలు అందడం లేదు. ప్రభుత్వం వెంటనే ఈ విషయంలో కల్పించుకొని అన్ని గ్రామాలకు అమలు చేసినట్లుగానే పథకాలు ముంపు గ్రామాల ప్రజలకు అమలు చేయాలని లబ్ధిదారులను ఎంపిక చేసి పథకాలు మంజూరు చేయాలని ముంపు గ్రామాల బాధితులు  కోరుతున్నారు.

ఇందిరమ్మ ఇల్లు రాదంటా

-ఉన్న ఊరు, భూమి అంతా పోయింది. ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయితే ఇచ్చిన ప్లాట్లో ఇల్లు కట్టుకుందాం అనుకున్న కానీ ఇల్లుకు లోన్ రాదంటా. ఏ ఊరి వాళ్ళమో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఆఫీసర్లు మాకు ఇప్పుడు ఏ పథకం రాదన్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం మాకు పథకాలు వచ్చేలా చూడాలి.

  గూడూరి రాజు, ఆర్ అండ్ ఆర్ కాలనీ (సింగారం)

స్వయం ఉపాధి ఏర్పాటుకు 

ఉపాధిని కోల్పోయిన మేము  ప్రభుత్వ  పథకాలతో స్వయం ఉపాధి పొందుదాం అనుకున్నాం. ఇప్పుడు పథకానికి అర్హులం కాదని  అనడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. ప్రభుత్వం మా ముంపు గ్రామాల ప్రజలకు కూడా రాజీవ్ యువ వికాసం కింద రుణాలు ఇస్తే  ఉపాధి పొందుతాం. అధికారులు స్పందించాలి.

 కనకయ్య, ఆర్ అండ్ ఆర్ కాలనీ