28 February, 2026 | 9:34 PM

అంగన్వాడీలపై సర్పంచుల పర్యవేక్షణపై ప్రభుత్వం పునరాలోచించాలి

28-02-2026 07:37 PM

– సీఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్

దమ్మపేట,(విజయ క్రాంతి): మండల పరిధిలోని మొద్దులగూడెం, తాటి సుబ్బన్న గూడెం గ్రామ సమన్వయ కమిటీ సమావేశం శ్రీదేవి అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సందర్భంగా సీఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను స్థానిక సర్పంచులకు అప్పగించరాదని, అంగన్వాడీలకు నెలనెలా వేతనాలు అందించాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

అంగన్వాడీల కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలు స్థానిక సర్పంచుల చేతులలో పెట్టడం అంటే అంగన్వాడీలను ఐసిడిఎస్ ఉద్యోగులను అవమానపరచడమేనన్నారు. గ్రామ పంచాయతీల పెత్తనం కిందికి వెళితే రాజకీయ వత్తిడి, తమకు నచ్చని వారి పై కక్ష సాధింపు చర్యలు పాల్పడే అవకాశం ఉందని అన్నారు. గ్రామాల్లో అంగన్వాడీ ఉద్యోగులు చాలీచాలని వేతనాలతో సక్రమంగా సమయానికి జీతాలు రాకపోయినా కొన్ని దశాబ్దాలుగా పసిపిల్లలకు బాలింతలకు గర్భిణీలకు పౌష్టికాహారం అందిస్తున్నారని, అటువంటి ఐసిడిఎస్ శాఖను ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పుకొని రాజకీయ జోక్యం పెరిగే విధంగా చేయకూడదని అన్నారు.

అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం ముందు తమ సమస్యలను పెడితే వాటిని పట్టించుకోకుండా నూతన విద్యా విధానం ముందుకు తెస్తూ ఆన్లైన్ క్లాసులు పెడతామని అంటుందని, మారుమూల గ్రామాలలో నెట్ సౌకర్యం, అంగన్వాడీల దగ్గర సరైన సెల్ఫోన్ సౌకర్యాలు లేనప్పుడు క్లాసులు ఎలా విని అర్థం చేసుకుంటారని అన్నారు. అంగన్వాడి కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఆయా టీచర్ పోస్టులు భర్తీ చేయాలని, అవసరమైన చోట్ల అంగన్వాడి కేంద్రాలను నిర్మించాలని, పెండింగ్ వేతనాలు టిఎడిఎలు విడుదల చేయాలని, పదవి విరమణ చేసిన అంగన్వాడీ టీచర్లు ఆయాలకు పెండింగ్ గ్రాడ్యుటి అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కవిత, ఝాన్సీ, సోమమ్మ, సిఐటియు నాయకులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.