27 June, 2026 | 8:23 PM

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు

27-06-2026 07:22 PM

- తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేత

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామ పంచాయతీలో విధులు నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ అధికారి (జీపీవో) సిలివేరి ప్రవీణ్‌పై గ్రామస్తులు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గ్రామస్తులు వినతిపత్రం సమర్పిస్తూ తమ సమస్యలను వివరించారు. వినతిపత్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం, వివిధ ధ్రువపత్రాల కోసం కార్యాలయాన్ని ఆశ్రయించే ప్రజలను జీపీవో అనవసర ప్రశ్నలతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

ధ్రువపత్రాలకు సంబంధం లేని విషయాలను అడుగుతూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారని తెలిపారు. ఏవైనా వివరాలు అడిగితే ధ్రువపత్రాల జారీ ప్రక్రియను అడ్డుకుంటానని బెదిరింపులకు పాల్పడుతున్నారని గ్రామస్తులు పేర్కొన్నారు. అంతేకాకుండా గ్రామ పాలకవర్గ సభ్యుల అభిప్రాయాలను కూడా పట్టించుకోకుండా ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ అంశాలపై సమగ్ర విచారణ జరిపి, అవసరమైతే గ్రామానికి వేరే జీపీవోను నియమించాలని తహసీల్దార్‌ను గ్రామస్తులు కోరారు.