18 May, 2026 | 12:01 PM

పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా సైకిల్ పై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

18-05-2026 10:54 AM

రైతులు పండించిన ప్రతి వరి గింజలు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా ప్రభుత్వ బీర్ల ఐలయ్య యాదగిరిగుట్ట నుండి ఆలేరు వరకు సైకిల్‌ పై ప్రయాణించారు. సోమవారం పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా ఉదయం ఆరు గంటలకు యాదగిరిగుట్ట నుండి సైకిల్ పై కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వంగపల్లి మీదుగా ఆలేరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో పేద, సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వ హయాంలో సామాన్య ప్రజలు మళ్లీ సైకిళ్లపై ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.

అనంతరం వంగపల్లి మీదుగా ప్రయాణిస్తూ అక్కడి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి వడ్ల కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ధాన్యం కొనుగోలు పారదర్శకంగా, వేగవంతంగా జరిగేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.రైతులు పండించిన ప్రతి గింజకు సరైన ధర అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని, కొనుగోలు కేంద్రాల్లో లారీలు, తూకం, హమాలీలు వంటి సౌకర్యాలు సమయానికి అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలిగితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎరుకల హేమేంధర్ గౌడ్, ముక్కెర్ల మల్లేష్ యాదవ్, కమలీకర్ రాజేష్, కాల్నే భాస్కర్, బాల్ రెడ్డి, కల్లపల్లి శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.