10 March, 2026 | 5:40 PM

మహిళా హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు

09-03-2026 05:27 PM

మహిళలకు రక్షణ చట్టాలు కఠినంగా అమలు చేయాలి

ప్రజా సంఘాల నాయకుల డిమాండ్

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం ఉల్లిపిట్ట గ్రామంలో ప్రజా సంఘాలు DYFI, AIDWA, TAGS, PNM ఆధ్వర్యంలో అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా హక్కుల పరిరక్షణ, సమానత్వం కోసం ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి దుర్గం అనిత, తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం అధ్యక్షురాలు కోరంగే మాలశ్రీ, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గెడం టీకానంద్, జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్, ప్రజానాట్యమండలి జిల్లా కోశాధికారి ఆర్. మహేష్, మాజీ ఎంపిటిసి పార్వతి తదితరులు పాల్గొని మాట్లాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 1908లో కార్మిక ఉద్యమాల నుంచి ఆవిర్భవించిందని పేర్కొన్నారు.

మహిళలకు తక్కువ పని గంటలు, ఓటు హక్కు, సమాన వేతనం, మెరుగైన జీవన పరిస్థితులు కల్పించాలనే లక్ష్యంతో ఈ ఉద్యమం ప్రారంభమైందన్నారు. మహిళలు రాజకీయాలు, ఉద్యోగాలు, ఉపాధి రంగాలలో ముందుకు రావాలని, తమ హక్కుల సాధన కోసం సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మహిళలు ఒక్టు బాయి, హేమలత, శైలజ, లీలావతి, అనిత, భాగ్య, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.