9 May, 2026 | 2:37 AM

కల్లాల నుండి ధాన్యం, మక్కలను మిల్లులకు తరలించాలి

09-05-2026 01:09 AM

కలెక్టర్ రాహుల్ శర్మ 

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) మే 8 (విజయక్రాంతి): తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే కొనుగోలు చేసి, వెంట వెంటనే మిల్లులకు తరలించాలని, లారీల పైన ఆధార పడకుండా అధికారులు కొద్ది మొత్తం ఉంటే ట్రాక్టర్ ల ద్వారా మ్యాపింగ్ చేసిన మిల్లుకు తరలించాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం చిట్యాల మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, కొనుగోలు తీరును పరిశీలించారు.

వాతావరణ సూచనల ప్రకారం కల్లాలలో గన్ని సంచులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అనంతరం చిట్యాల మండల శివారులోని బాల మురుగన్ పత్తి మిల్లును పరిశీలించి మక్కలు నిల్వ చేసుకునే విధానం పరిశీలించి వే బ్రిడ్జిని తనికి చేశారు. ఓ పి ఎం ఎస్ లో నమోదు ఎంటర్ అవడం లేదన్న సమస్యను రైతులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. పత్తి మిల్లులో నిల్వ చేసే మక్కలను వర్షానికి తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

సిగ్నల్ సమస్య వల్ల ఆన్లైన్ లో నమోదు  కావడం లేదని తెలిసి కొనుగోలు కేంద్రం నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేసి ఆన్లైన్ నమోదు ప్రక్రియను పరిశీలించారు. అనంతరం మొగుళ్ళ పల్లి మండల కేంద్రంలోని ఆధునిక వ్యవసాయ గిడ్డంగిని పరిశీలించి నిల్వల వివరాలు గిడ్డంగి విస్తీర్ణం అడిగి తెలుసుకన్నారు. రేగొండ మండలం రూపిరెడ్డి పల్లిలో గల సహకార సంఘం భవనాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, డీఎస్‌ఓ కిరణ్ కుమార్, సహకార అధికారి వాలియ నాయక్, వ్యవసాయ అధికారి బాబురావు, మార్క్ ఫెడ్ అధికారి శ్రీలత తదితరులు పాల్గొన్నారు.