25 April, 2026 | 6:24 PM

ప్రచారం కోసమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

25-04-2026 04:54 PM

సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు - జాజిరి శ్రీనివాస్

సత్తుపల్లి,(విజయక్రాంతి): ప్రచార ప్రకటనల కోసం మాత్రమే ప్రభుత్వం పలుచోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్ అన్నారు. శనివారం కాకర్లపల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సిపిఎం సత్తుపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా జాజిరి శ్రీనివాస్ మాట్లాడుతూ... కొనుగోలు కేంద్రాలలో గన్ని సంచులు, తూకం మిషన్లు, తేమ శాతం కొలిచే యంత్రాలు, మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు.

కొనుగోలు కేంద్రాలలో టెంటు తప్ప మరేమీ కనిపించడం లేదన్నారు. గోనెసంచులు లేకుండా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంతో ధాన్యం విక్రయించుకునేందుకు రైతులు 15- 20 రోజుల నుండి ధాన్యం ఆరబెట్టి, తూర్పారపెట్టి రాశులుగా పోసి ఉంచారన్నారు. రైతులు గోనె బస్తాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఒక్క కాకర్లపల్లి గ్రామంలోనే సుమారు 15 లారీలకు సరిపోను వరి ధాన్యం రాశులుగా పోసి పట్టాలు కప్పి ఉంచారన్నారు. రైతులకు నష్టం కలిగే విధంగా తేమ, తాలు పేరుతో మోసం చేయకుండా అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలన్నారు.

సన్న రకం, దొడ్డు రకం ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన 500 బోనస్ అందించాలని కోరారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కొనుగోలు కేంద్రాల వద్ద నీడ, తాగునీరుతోపాటు మౌలిక వసతులు కల్పించాలన్నారు. రైతులను ఇబ్బందులకు గురి చేసేలా కొనుగోలు కేంద్రాల నిర్వహకులు ప్రవర్తిస్తే రైతులతోనే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు కువ్వారపు లక్ష్మణరావు, బండి వేలాద్రి, బెజవాడ లక్ష్మీనారాయణ, కొప్పుల చిన్నస్వామి, రైతులు దొడ్డా సత్యం, గోట్ల శ్రీమన్నారాయణ, మోరంపూడి వెంకట అప్పారావు తదితరులు పాల్గొన్నారు.