అకాల వర్షాలతో తడిసిన ధాన్యం.. రైతుల ఆందోళన
బచ్చన్నపేట, జూన్ 12 (విజయక్రాంతి): మండల పరిధిలో కురిసిన అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసి రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సరైన రక్షణ చర్యలు లేకపోవడంతో ధాన్యం నీటిలో నానిపోవడం, గోనె సంచులు తడవడం వల్ల నాణ్యత దెబ్బతింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని తగిన విధంగా టార్పాలిన్లతో కప్పకపోవడం, వర్షపు నీరు నిల్వ ఉండటంతో పెద్ద ఎత్తున ధాన్యం తడిసినట్లు రైతులు తెలిపారు. ఇప్పటికే పంట సాగులో నష్టాలు ఎదుర్కొన్న రైతులకు ఈ పరిస్థితి మరింత భారంగా మారిందన్నారు.
తడిసిన ధాన్యాన్ని అధికారులు వెంటనే పరిశీలించి నష్టపరిహారం అందించడంతో పాటు కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. అలాగే కొనుగోలు కేంద్రాల్లో సరిపడా టార్పాలిన్లు, భద్రతా ఏర్పాట్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.అకాల వర్షాల కారణంగా ధాన్యం నాణ్యత తగ్గితే రైతులకు ఆర్థిక నష్టం తప్పదని, ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని స్థానిక రైతు సంఘాల నాయకులు కోరారు.






