6 June, 2026 | 7:35 PM

గ్రామసభలను పకడ్బందీగా నిర్వహించాలి: ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి

06-06-2026 06:28 PM

ఉట్నూర్,(విజయ క్రాంతి): ప్రజా పాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామపంచాయతీలలో గ్రామసభలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటిడిఏ), ఉట్నూర్ ప్రాజెక్ట్ అధికారి మంద మకరందు అన్నారు. శనివారం ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన గ్రామసభల నిర్వహణ విధానం, అనుసరించాల్సిన మార్గదర్శకాలు, చేపట్టాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి సమగ్రంగా వివరించారు. 

ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అధికారి గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులతో పరిచయం చేసుకొని, గ్రామసభలను ప్రజల భాగస్వామ్యంతో సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామస్థుల సమస్యలు, అవసరాలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించి తీసుకునే నిర్ణయాలను పారదర్శకంగా నమోదు చేయాలని తెలిపారు. గ్రామసభలో తీసుకున్న తీర్మానాలు, నిర్ణయాలను తప్పనిసరిగా నిర్ణయ్ యాప్‌తో పాటు సంబంధిత ప్రభుత్వ పోర్టల్‌లలో సకాలంలో అప్లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు.

గ్రామసభల ద్వారా ప్రజల అభిప్రాయాలు, సూచనలు ప్రభుత్వానికి చేరడంతో పాటు స్థానిక సమస్యల పరిష్కారానికి సమర్థవంతమైన వేదికగా అవి పనిచేస్తాయని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో గ్రామసభలు కీలక పాత్ర పోషిస్తాయని, ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు మరింత విజయవంతమవుతాయని ఆయన అన్నారు. గ్రామస్థాయిలో ప్రజా పాలనను బలోపేతం చేయడంలో గ్రామసభలు అత్యంత ముఖ్యమైనవని, ప్రతి గ్రామపంచాయతీలో వాటి నిర్వహణను విజయవంతం చేయాలని తెలిపారు.