ఘనంగా ఈస్టర్ వేడుకలు
శాంతి, సౌహార్దానికి పిలుపునిచ్చిన ఎమ్మెల్యే కాలే యాదయ్య
మొయినాబాద్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): మొయినాబాద్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఈస్టర్ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా జరిగాయి. కనకమామిడి గ్రామ సమీపంలోని కొండపై నిర్వహించిన ప్రత్యేక వేడుకల్లో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
ఆదివారం ఈస్టర్ పండుగను పురస్కరించుకుని చర్చి ఫాదర్ అందించిన దైవ సందేశాన్ని ఎమ్మెల్యే శ్రద్ధగా విన్నారు. అనంతరం చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని, భక్తులందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ యేసుక్రీస్తు అందించిన త్యాగం, ప్రేమ, క్షమాగుణం వంటి సందేశాలు ప్రతి మనిషి జీవితానికి మార్గదర్శకంగా నిలవాలన్నారు. సమాజంలో శాంతి, సౌహార్దం మరియు పరస్పర గౌరవాన్ని పెంపొందించడంలో ఈస్టర్ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.ప్రతి ఒక్కరూ సేవా భావంతో, పరస్పర సహకారంతో కలిసి మెలిసి ఉంటూ సమాజాభివృద్ధికి తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు. వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ దుబ్బా సోనియా దర్శన్, సర్పంచ్ శ్రీదివ్య మురళీధర్ రెడ్డి, వివిధ పార్టీల నాయకులు, చర్చి నిర్వాహకులు పాల్గొన్నారు.




