గజ్వేల్ ఘటన ముమ్మాటికీ ప్రజాస్వామ్యంపై దాడే
మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ధ్వజం
కడ్తల్, ఏప్రిల్ 5(విజయక్రాంతి): గజ్వేల్లోని మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు కె. చంద్రశేఖర్ రావు క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు జరిపిన దాడిని కల్వకుర్తి బీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జి జైపాల్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. ఆదివారం కడ్తాల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దాహంతో రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తోందని మండిపడ్డారు.
ప్రభుత్వ భవనంలోకి చొరబడి దాడికి పాల్పడటం అత్యంత హేయమైన చర్య అని, ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని జైపాల్ యాదవ్ ఆరోపించారు. ఒక మాజీ ముఖ్యమంత్రి కార్యాలయానికే రక్షణ లేకపోతే, రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు.
సీఎం రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కార్యాలయాలపై దాడులు జరుగుతున్నాయని, ప్రభుత్వం ఇలాంటి దాడులను ప్రోత్సహించడం సిగ్గుచేటని విమర్శించారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రం ప్రశాంతంగా ఉండేదని, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో అసాంఘిక శక్తులు చెలరేగిపోతుండటంతో శాంతిభద్రతలు పూర్తిగా గాడి తప్పాయని ధ్వజమెత్తారు.
గజ్వేల్ ఘటనకు బాధ్యులైన వారిని తక్షణమే గుర్తించి, వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జైపాల్ యాదవ్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి, కల్వకుర్తి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎడ్మ సత్యం, ఎల్.హెచ్.పి.ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దశరథ్ నాయక్, సర్పంచుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మీనరసింహారెడ్డి మరియు ఇతర పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.




