11 June, 2026 | 1:14 PM

కామారెడ్డిలో విషాదం.. అప్పుల పాలై ఆత్మహత్య

11-06-2026 12:33 PM

ఆన్లైన్ బెట్టింగ్ లో డబ్బులు పోయి

అప్పుల పాలై ఒకరి ఆత్మహత్య 

చెట్టుకు ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

కామారెడ్డి, జూన్ 11 (విజయక్రాంతి): ఆన్లైన్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుని అప్పుల పాలై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి పట్టణంలో చోటు చేసుకుంది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి పట్టణంలోని రామారెడ్డి రోడ్డులో చర్చి వెనకాల ఉన్న పొదల్లో ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని మృతిచెందిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి ఎం ఆర్ కాలనీ కి చెందిన మృతుడు అంకం క్రాంతి కుమార్ (40) గా గుర్తించారు.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

క్రాంతి కుమార్‌కు భార్య లావణ్య, కుమార్తె సంయుక్త, కవల కుమారులు విఘ్నేష్, వినాయక్ ఉన్నారు. కుటుంబ సభ్యులు, స్థానికుల సమాచారం మేరకు ఆయన కొంతకాలంగా  ఆన్లైన్ బెట్టింగ్ కి పాల్పడుతూ సుమారుగా 12 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధతో మానసిక ఆందోళనకు గురైనట్లు తెలిసింది. దీంతో అప్పుల భారాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు పోస్టుమార్టం నివేదిక, విచారణ అనంతరం వెల్లడికానున్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ఎమ్మార్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కలచివేశాయి.