టెన్త్,ఇంటర్ టాపర్లకు ఘన సన్మానం
హనుమకొండ అర్బన్, మే 17 (విజయక్రాంతి): పదవ తరగతి, ఇంటర్మీడియట్ 2025,26 సంవత్సరం పరీక్షా ఫలితాలు, క్రీడల్లో జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని, విద్యార్థులకు విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
హనుమకొండ కాళోజీ సెంటర్లోని వరంగల్ డీసీసీబీ ఆడిటోరియంలో జరిగిన ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, వరంగల్ కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యా శారద హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రభుత్వం తరపున పూర్తి స్థాయి ప్రోత్సాహం, అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు.ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను శాలువాలు, ప్రశంసా పత్రాలతో ఘనంగా సత్కరించారు. విద్యార్థులను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన ఉత్తమ అధ్యాపకులను, ఉపాధ్యాయులను కూడా ఈ సందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారులు, వివిధ కళాశాలల అధ్యాపకులు, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






