18 May, 2026 | 3:35 AM

స్నేహితుడి కుటుంబానికి రూ.5.64 లక్షల సహాయం

18-05-2026 02:35 AM

కేసముద్రం, మే 17 (విజయక్రాంతి): అనారోగ్యంతో చనిపోయిన తమ మిత్రుడి కుటుంబానికి స్నేహితులు ఆర్థికంగా అండగా నిలిచిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కందిపాటి రాము ఇటీవల అనారోగ్యానికి గురై అకాల మృత్యు వాతపడ్డాడు. దీనితో గ్రామానికి చెందిన యువకులు, స్నేహితులు కలిసి భారీగా ఆర్థిక సహాయాన్ని అందించారు.

హైదరాబాద్ ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ సిబ్బంది అందించిన 2.5లక్షల రూపాయలతో పాటు గ్రామానికి చెందిన బొగ్గుల రాజేష్ అతని మిత్ర బృందం కలిసి సేకరించిన 5.64 లక్షల రూపాయలను ఆదివారం రాము కుటుంబానికి మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి చేతుల మీదుగా ఆర్థిక సహాయాన్ని అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ వేల్పుల సుజాత రామచంద్రయ్య, కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు గండి శ్రీనివాస్, బొగ్గుల నాగయ్య, బీఆర్‌ఎస్ మండల మాజీ అధ్యక్షుడు మోడెం రవీందర్ గౌడ్, మూరగుండ్ల యాదగిరి, ఉపసర్పంచ్ పెదగాని రవి, పెరుమాళ్ల ఎల్ల గౌడ్ పాల్గొన్నారు.